Liquor Sales: ‘కిక్కెక్కిస్తున్న’ చలి!.. టార్గెట్‌ న్యూ ఇయర్‌

23 Dec, 2021 07:11 IST|Sakshi

చలితో పాటే పెరిగిన మద్యం విక్రయాలు 

వారం రోజులుగా అమ్మకాలు అదుర్స్‌ అంటున్న ఆబ్కారీ 

టార్గెట్‌ న్యూ ఇయర్‌పై దృష్టి 

గతేడాది కంటే ఈసారి భారీగా పెరిగిన అమ్మకాలు

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌లో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. గత వారం, పది రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడంతో చలి తీవ్రమైంది. దీంతో మద్యం ప్రియులు లిక్కర్‌ వినియోగాన్ని పెంచారు. కొత్త మద్యం పాలసీ ఆరంభంలోనే అమ్మకాలు పెరగడంతో మద్యం దుకాణాలు సైతం కళకళలాడుతున్నాయి. రెస్టారెంట్లు, బార్‌లలోనూ మద్యం వినియోగం పెరిగినట్లు ఆబ్కారీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే ఊపు న్యూ ఈయర్‌ జోష్‌ వరకు ఉంటుందని భావిస్తున్నారు. గతేడాది కోవిడ్‌ కారణంగా చాలా మంది కొత్త సంవత్సర వేడుకలకు దూరంగానే ఉన్నారు. పబ్బులు, బార్లు  వెలవెలబోయాయి. కొద్ది రోజులుగా ఒమిక్రాన్‌ ఆందోళనలు నెలకొన్నప్పటికీ కోవిడ్‌ తీవ్రత అంతగా లేకపోవడంతో కొత్త సంవత్స వేడుకల సందర్భంగా మద్యం వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్‌ అధికారి ఒకరు తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో ఇందుకు అనుగుణంగా టార్గెట్‌లపైన దృష్టి సారించే అవకాశం ఉంది.  

చలితో పాటే... 
గతంలో కోవిడ్‌ ఆంక్షల దృష్ట్యా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. తక్కువ మోతాదులో ఇళ్ల వద్దనే  మద్యం వినియోగించారు. బార్లు తెరిచి ఉన్నప్పటికీ ధైర్యంగా వెళ్లేందుకు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం చాలా వరకు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వినియోగం పెరిగింది. దానికి తోడు వారం, పది రోజులుగా పెరిగిన చలి వాతావరణం మందుబాబులను మరింత ఉత్సాహపరుస్తోంది. కొత్త మద్యం పాలసీ మేరకు గ్రేటర్‌లో 615 మద్యం దుకాణాలకు అను మతులనిచ్చిన సంగతి తెలిసిందే. నగరంలోని అన్ని చో ట్ల కొత్త దుకాణాల్లో పూర్తిస్థాయిలో అమ్మకాలు మొదలయ్యాయి. ఆరంభంలోనే లి క్కర్‌ సేల్స్‌ భారీగా పెరగడం పట్ల  వైన్స్‌ నిర్వాహకులు సైతంసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.  

చదవండి: (మూడేళ్లు సహజీవనం.. ఇపుడు దూరంగా ఉంటోందని..) 

109 శాతం పెరిగిన విక్రయాలు 
గతేడాది డిసెంబర్‌తో పోల్చితే ఈ డిసెంబర్‌లో మద్యం అమ్మకాలు 109.29 శాతం పెరిగినట్లు ఎక్సైజ్‌శాఖ అంచనా. లిక్కర్‌కు పోటీగా బీర్ల అమ్మకాలు కూడా బాగా పెరిగాయి. ఉదాహరణకు గత సంవత్సరం హైదరాబాద్‌–1 డిపో పరిధిలో 8.96 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరుగగా ఈ సారి  10.55 లక్షల కేసులకు పెరి గింది. అలాగే బీర్ల అమ్మకాలు గతేడాది 5.91 లక్షల కేసులు అయితే  ఈ డిసెంబర్‌ నాటికి  8.58 లక్షల కేసులకు పెరిగాయి. గతేడాది కోవిడ్‌ కాలంలో బీర్ల వినియోగం తగ్గడం గమనార్హం. ఈ ఏడాది సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తిరిగి అమ్మకాలు పెరిగాయి.  

మరిన్ని వార్తలు