ఏరులై పారనున్న మద్యం.. కల్తీ చేసేందుకు వేల జీతాలతో ప్రత్యేక సిబ్బంది

4 Oct, 2022 12:44 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: ఏడాదికోసారి వచ్చే పండుగ దసరా. ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు మాంసంతోపాటు మద్యంపై ఎనలేని మక్కువ చూపుతారు. ఏ పండుగకూ లేని విధంగా దసరాకు మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా గోదాంలలో ఎక్కువగా నిల్వ చేయడంతోపాటు మద్యం దుకాణాలకు కోటాకు మించి సరఫరా చేస్తుంది. కొందరు మద్యం ప్రియులు కూడా పండుగ అవసరాల కోసం ముందస్తుగానే భారీగా కొనుగోళ్లు చేసినట్లు తెలుస్తోంది.

అయితే పండుగ సందర్భంగా మద్యానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్‌ వరంగల్‌తోపాటు జిల్లాలోని కొన్ని వైన్స్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు కల్తీకి పాల్ప డుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వేలకొద్దీ బాటిళ్ల మూతలు తీసి.. తక్కువ ధర ఉన్న మద్యం, నీళ్లు కలిపే తంతును కొనసాగిస్తున్నాయి. దసరా పండుగ సందర్భంగా రూ.లక్షల్లో లాభాలు ఆర్జించే దిశగా కొందరు వైన్స్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నా.. ఆబ్కారీ శాఖ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది.

మందును కల్తీ చేసేందుకు అనుభవజ్ఞులైన వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని.. ఏరోజుకారోజు పని పూర్తి చేసేందుకు డబ్బులు ఇవ్వడంతోపాటు కొందరికి వచ్చే లాభాల్లో సగం వాటా ఇస్తామంటూ ఒప్పందాలు కుదుర్చుకొని పని కానిచ్చేస్తున్నారన్న టాక్‌ వస్తోంది. ఇటీవలి కాలంలో వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని ఓ వైన్స్‌లో కల్తీ జరుగుతుందంటూ ఎక్సైజ్‌ అధికారులు ఆ షాపును సీజ్‌ చేశారు.

ఏడాదిలో తూతూమంత్రంగా ఏదో చేయాలన్నట్లుగా ఓ వైన్స్‌ను సీజ్‌ చేసిన అధికారులు నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్‌లోని అనేకచోట్ల కల్తీ జరుగుతున్నా పెద్దగా పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నారు. వారంతా ‘మామూలు’గా చూసుకుంటుండడంతోనే అలా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైన్స్‌లు కూడా సమయపాలన లేకుండా నడుపుతున్నా చర్యలు తీసుకోవడం లేదనే మాటలు ప్రజల నుంచి వస్తున్నాయి. అంతేకాక మద్యం కల్తీ కావడం వల్ల ఎంత తీసుకున్నా కిక్కు ఎక్కడం లేదని కొందరు మద్యంబాబులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. 

మూతలు తీసేటోళ్లకు పండుగే..
దసరా పండుగ వేళ మద్యం కిక్కు ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో కొన్ని వైన్స్‌లు సీల్‌కు ఇబ్బంది లేకుండా మూత తీసి కల్తీ చేసే గ్యాంగ్‌లను నియమించుకున్నాయి. ఈ దందా అంతా రాత్రివేళల్లో జరిగే అవకాశం ఉండటంతో ఒక్కో రోజుకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు చెల్లిస్తున్నారనే టాక్‌ వస్తోంది. గ్రేటర్‌ వరంగల్‌తోపాటు జిల్లాలో చాలాచోట్ల ఇలాంటి గ్యాంగ్‌లు ఉన్నాయి. బ్లండర్‌ స్పైడ్‌లో ఓసీ, రాయల్‌ స్టాగ్‌లో ఐబీలతోపాటు ఐబీ, ఓసీల్లో నీటిని కలిపి మద్యం ప్రియులకు విక్రయిస్తున్నాయి.

రాయల్‌ స్టాగ్‌ విస్కీ బాటిళ్ల సీల్‌ పగలకుండా చాకచక్యంగా మూత తెరిచి దాదాపు సగం మద్యాన్ని ప్లాస్టిక్‌ మినరల్‌ వాటర్‌ బాటిల్‌లో పోస్తున్నారు. మరో బాటిల్‌లోని నీళ్లతో నింపి.. ఆపై విస్కీలో కలిపి బ్రాండెడ్‌ బాక్స్‌లో పెడుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. గతంలోనూ ఈ తరహా వారిని హైదరాబాద్‌లో ఎక్సైజ్‌ అధికారులు అరెస్టు చేసినా.. ఇక్కడ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా వరంగల్‌లోని కొత్తవాడ, హంటర్‌ రోడ్డు ఎక్సైజ్‌ అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదనే టాక్‌ ఉంది.

‘పెద్ద బ్రాండ్‌లోకి చిన్న బ్రాండ్‌ల మందును కలపొచ్చు. చిన్న బ్రాండ్‌ల్లోనూ నీళ్లు కలిపే అవకాశముంది. ఇలా లూజ్‌ సేల్‌ చేసే వైన్స్‌లపై నిఘా ఉంచాం. ఖానాపురంలో వైన్స్‌కు రూ.5,20,000 జరిమానా విధించాం. దసరా వేళ కల్తీకి అవకాశం ఉండడంతో మా సిబ్బంది క్షేత్రస్థాయిలో కన్నేసి ఉంచారు’ అని జిల్లా ఎక్సైజ్‌ ఉన్నతాధికారి లక్ష్మణ్‌నాయక్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు