Telangana Lockdown: లిక్కర్‌ దొరుకుతుంది

12 May, 2021 02:18 IST|Sakshi
ఆదిలాబాద్‌లో మంగళవారం బైక్‌పై భారీగా మద్యాన్ని తీసుకెళ్తున్న దృశ్యం

ఉదయం 6–10 గంటల మధ్య అమ్మకాలకు సర్కారు అనుమతి 

ప్రతి షాపు ముందూ భౌతికదూరం రింగులు ఏర్పాటు చేయాలి 

నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులు సీజ్‌ 

ఉదయం పూట బార్లు ఎలా అంటున్న యజమానులు 

డోర్‌ డెలివరీకి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి 

లాక్‌డౌన్‌ వార్తలతో వైన్స్‌ ముందు మందుబాబులు క్యూ 

మంగళవారం ఒక్క రోజే రూ.120 కోట్లకు పైగా విక్రయాలు

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కాలంలోనూ రాష్ట్రంలో మద్యం విక్రయాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతినిచ్చిన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే వైన్‌ షాపులు, బార్, రెస్టారెంట్‌లు తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం విక్రయించే సమయంలో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, అన్ని దుకాణాల ముందు భౌతికదూరం పాటించేలా రింగులు ఏర్పాటు చేసి వినియోగదారులు వాటిలో నిలబడి మద్యం కొనుగోలు చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. పర్మిట్‌ రూమ్స్‌ తెరిచేందుకు వీల్లేదని, కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే షాపులను సీజ్‌ చేస్తామని ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలను అదుపు చేసే బాధ్యత కూడా షాపు యజమాన్యమే తీసుకోవాలని తెలిపారు.   చదవండి: (Telangana: బస్సులు, మెట్రో రైళ్లు తిరిగే సమయాలివే..)

పొద్దున్నే ఎవరొస్తారు? 
ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. ఉదయాన్నే బార్లు ఎలా తెరవాలన్న దానిపై యజమానుల్లో సందిగ్ధత నెలకొంది. పొద్దున్నే బార్లలో కూర్చొని మద్యం తాగేందుకు ఎవరొస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఉదయం 10 గంటలకే రెస్టారెంట్లు మూసివేయడం ఎలా అని వాపోతున్నారు. గత లాక్‌డౌ సమయంలోనే తాము తీవ్రంగా నష్టపోయామని, లైసెన్సు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితుల్లోకి వెళ్లామని, మళ్లీ ఇప్పుడు లాక్‌డౌన్‌కు వెళితే అసలు బార్లు నడిపే పరిస్థితి కూడా ఉండదంటున్నారు. దీంతో  బార్ల నుంచి కూడా మద్యాన్ని రిటైల్‌గా అమ్ముకునే అవకాశం ఇవ్వాలని, లేదంటే వైన్‌ షాపులు బంద్‌ చేసిన తర్వాత బార్ల నుంచి డోర్‌ డెలివరీకి అనుమతివ్వాలని నిర్వాహకులు కోరుతున్నారు.  

‘మందు’చూపు 
ఒకపక్క రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరుగుతుండగానే, లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టుగా వార్తలు వెలువడడంతో మందుబాబులు వైన్‌ షాపుల ముందు క్యూలు కట్టారు. మిగతా షాపుల మాట ఎలా ఉన్నా మద్యం దుకాణాలు మాత్రం కిక్కిరిసిపోయి కన్పించాయి. కరోనా నిబంధనలు మరిచిపోయి మద్యం కోసం ఎగబడ్డారు. కొన్నిచోట్ల పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి కర్ఫ్యూ సమయం వరకు ఇదే పరిస్థితి ఉంది. లాక్‌డౌన్‌ సమయంలో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందో లేదో అన్న సందేహంతో చాలామంది 10 రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేయడం కన్పించింది. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.120 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్‌ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ నెలలో 11 రోజులకు రూ.670 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, మంగళవారం ఒక్క రోజే సగటుకు రెండింతలు ఎక్కువగా అమ్ముడయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  చదవండి: (నేటి నుంచి 10 రోజుల లాక్‌డౌన్‌.. మినహాయింపు వాటికే!) 

రాజధాని వాటా రూ.50 కోట్లు!
హైదరాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. చిన్నా..పెద్ద..మహిళలు..పురుషులు అన్న తేడా లేకుండా షాపుల ముందు బారులు తీరారు. నగర పరిధిలోని సుమారు 300 మద్యం దుకాణాల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. రద్దీని క్రమమద్ధీకరించేందుకు పలు చోట్ల పోలీసులు, పెట్రోలింగ్‌ సిబ్బంది రంగంలోకి దిగాల్సి వచ్చింది. కాసేపటికే పలు దుకాణాల వద్ద నో స్టాక్‌ బోర్డులు వెలిశాయి. నగరంలో రోజూ రూ.10 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. మంగళవారం ఒక్కరోజే అంతకు 5 రెట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగినట్లు ఆబ్కారీ అధికారులు అంచనా వేశారు.   

మరిన్ని వార్తలు