లిక్కర్‌కు‌ రాజకీయ రంగు.. సిండికేట్‌ చేతుల్లోకి

7 Feb, 2021 08:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని కొత్త మున్సిపాలిటీల్లో బార్‌ అండ్‌ రెస్టారెంట్ల వ్యవహారం లిక్కర్‌ సిండికేట్‌ చేతుల్లోకి వెళుతోందా..? ఈ క్రమంలోనే రాజకీయ రంగు పులుముకుంటోందా..? అంటే అవుననే అంటోంది ఇప్పటివరకు వాటి ఏర్పాటు కోసం ఎక్సైజ్‌ శాఖకు వచ్చిన దరఖాస్తుల తీరు. రాష్ట్ర వ్యాప్తంగా 72 మున్సిపాలిటీల్లో 159 బార్లకు నోటిఫికేషన్‌ వస్తే శుక్రవారం రాత్రి వరకు అందులో 10 శాతం బార్లకు ఒక్కటంటే ఒక్కటే దరఖాస్తు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో బార్లకు డిమాండ్‌ లేదని, అందుకే ఒక్కటే దరఖాస్తు వచ్చిందని అనుకుందామన్నా... కొన్ని బార్లకు వెల్లువలా దరఖాస్తులు వస్తున్నాయి. యాదగిరిగుట్ట బార్‌కు మొత్తం 67 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఒక్కటే దరఖాస్తు వచ్చిన చోట్ల కచ్చితంగా సిండికేట్‌ ప్రభావం ఉందని భావిస్తున్న ఎక్సైజ్‌ శాఖ మరికొన్ని చోట్ల రాజకీయ ప్రమేయం కూడా ఉందని అంచనా వేస్తోంది.

ఒక్కటంటే ఒక్కటే.. 
గత నెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బార్లకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటివరకు 12 రోజులు గడుస్తున్నా కొన్ని బార్లకు ఒక్కటంటే ఒక్క దరఖాస్తు రావడం ఎక్సైజ్‌ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఐజ, కొల్లాపూర్, ఆర్మూర్, సదాశివపేటల్లో ఒక్క దరఖాస్తే వచ్చింది. సదాశివపేటలో రెండు బార్లు నోటిఫై అయితే ఒక్కటే దరఖాస్తు రావడం గమనార్హం. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 7 బార్లు నోటిఫై కాగా, ఆ 7 బార్లకు కలిపి ఒక్కటే దరఖాస్తు వచ్చింది. మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లిలో, కామారెడ్డిలో రెండు దరఖాస్తులు వచ్చాయి. బాన్సువాడలో రెండు బార్లు నోటిఫై అయితే అక్కడ వచ్చింది నాలుగే దరఖాస్తులు. దరఖాస్తుల స్వీకరణకు ఇక ఒక్కరోజే మిగిలి ఉన్న నేపథ్యంలో మొత్తం నోటిఫై చేసిన వాటిలో కనీసం 10 శాతం బార్లకు దరఖాస్తులు తక్కువగా రావడం చర్చకు దారితీస్తోంది. మరోవైపు కొన్ని బార్లకు మాత్రం వెల్లువలా దరఖాస్తులొస్తున్నాయి. రాష్ట్రంలోనే గొప్ప ఆధ్యాత్మి క క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఒక్క బార్‌కు 67 దరఖాస్తులు వచ్చాయి. హాలియాలో 39, నేరేడుచర్ల, తొర్రూర్‌ బార్లకు ఒక్కోదానికి 35 దరఖాస్తులు వచ్చాయి. ఇలా మొత్తం 159 బార్లలో 11 చోట్ల 20 కన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఇక, జీహెచ్‌ఎంసీ పరిధిలో నోటిఫై అయిన 55 బార్లకు శనివారం నాటికి 108 దరఖాస్తులు రావడం గమనార్హం.
 
తుర్కయాంజాల్‌లో అలా.. చౌటుప్పల్‌లో ఇలా 
బార్ల కేటాయింపులో పారదర్శకత లేకుండా ఎక్సైజ్‌ శాఖ ముందుకు వెళ్లిందనే విమర్శలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడినా అక్కడ తాజా నోటిఫికేషన్‌ ప్రకారం ఒక్క బార్‌ కూడా నోటిఫై చేయలేదు. ఇందుకు గతంలో హైదరాబాద్‌ జిల్లాలో లైసెన్సులు తీసుకున్న బార్లను రంగారెడ్డి జిల్లాలోకి మార్చుకుని తుర్కయాంజాల్‌లో ఏర్పాటు చేయడమే కారణం. దీంతో ఇక్కడ కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడినా బార్లను నోటిఫై చేయలేకపోయారు. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో తాజా నోటిఫికేషన్‌లో రెండు బార్లను నోటిఫై చేశారు. అయితే, ఇక్కడ గతంలోనే రెండు ఎలైట్‌ బార్లు మంజూరు చేశారు. మళ్లీ ఇప్పుడు మరో రెండు బార్లు ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. కాగా, తాజాగా నోటిఫై అయిన రెండు బార్లకు మొత్తం 36 దరఖాస్తులు రావడం గమనార్హం.  


20 కంటే ఎక్కువ దరఖాస్తులు 
వచ్చిన బార్లు (శుక్రవారం రాత్రి వరకు) 
మున్సిపాలిటీ    దరఖాస్తుల సంఖ్య 
చొప్పదండి            28 
కొత్తపల్లి            27 
వైరా            64 
(ఇక్కడ రెండు బార్లు నోటిఫై అయ్యాయి) 
తొర్రూర్‌            35 
మరిపెడ            34 
హాలియా            39 
చండూరు            23 
చిట్యాల            20 
చేర్యాల            24 
నేరేడుచర్ల            35 
తిరుమలగిరి            23  

 

మరిన్ని వార్తలు