కన్నడిగుల కోసం సాహిత్య వేదిక

4 Mar, 2023 03:42 IST|Sakshi

రూ. 5 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌: గంగా జమునా తహెజీబ్‌కు ప్రతీకగా కొనసాగుతున్న హైదరాబాద్‌ జీవన విధానాన్ని నిలుపుకోవడానికి ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల సాహిత్యం, సంస్కృతిని రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకుని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న కన్నడ భాష మాట్లాడే కన్నడిగుల కోసం సాహిత్యవేదికను పునర్నిర్మాణం చేయాలని సీఎం నిర్ణయించారు. అందుకోసం రూ.5 కోట్లు మంజూరు చేశారు.

హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా నివసిస్తున్న కర్ణాటకవాసులు, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కాచిగూడలోని ‘కర్ణాటక సాహిత్య మందిరం’పునర్నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దానికి సంబంధించిన అనుమతిపత్రాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు శుక్రవారం ప్రగతిభవన్‌లో అందచేశారు.

సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు కమ్యూనిటీ అవసరాల కోసం వినియోగించుకునేవిధంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఆడిటోరియాన్ని తీర్చిదిద్దాలని అధికారులు, ఎమ్మెల్యేకు సీఎం సూచించారు. నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే వెంకటేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.   
 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు