విషాదం: అక్కతో కలిసి పాఠశాలకు.. నీళ్లు పట్టుకుందామని వెళ్లి..

4 Sep, 2021 01:31 IST|Sakshi
షరీఫా (ఫైల్‌) 

మహబూబ్‌నగర్‌ జిల్లా కందూర్‌లో ఘటన  

విచారణ చేపట్టిన అధికారులు

అడ్డాకుల: పాఠశాలలు తెరిచిన రెండో రోజే జరిగిన ఓ ప్రమాదం ఆ కుటుంబంలో విషాదం నింపింది. సంపు వద్ద నల్లా నీళ్లు పట్టుకుంటుండగా అందులో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలంలోని కందూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కందూర్‌ గ్రామానికి చెందిన షాహీనాబేగం, మహ్మద్‌ రఫిక్‌ దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లే చిన్న కుమార్తె షరీఫా (6)  పాఠశాలలో చేరాల్సి ఉంది. కాగా, గురువారం అక్కతో కలసి పాఠశాలకు వెళ్లింది. మధ్యాహ్న భోజన సమయంలో నల్లా నీళ్ల కోసం వెళ్లి పాఠశాల ఆవరణలో ఉన్న సంపులో ప్రమాదవశాత్తు పడి చనిపోయింది. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు ఊరంతా వెతికారు. శుక్రవారం ఉదయం సంపులో పాప మృతదేహం కనిపించడంతో కన్నీరు మున్నీరయ్యారు. 

అధికారుల విచారణ 
ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి, తహసీల్దార్‌ కిషన్, ఎంపీడీఓ మంజుల, ఎస్‌ఐ విజయకుమార్‌ తదితరులు పరిశీలించి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి ఈ పాఠశాలలోని ఓ గదిలో అంగన్‌వాడీ కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. లాక్‌డౌన్‌ కంటే ముందు షరీఫా అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లేది. ఈసారి పాఠశాలలో చేరాల్సి ఉన్నా తల్లిదండ్రులు ఇంకా చేర్పించలేదు. అక్కతోపాటు వెళ్లిన షరీఫా సంపులో పడి ప్రాణాలు కోల్పోయింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు