మొన్న పూజిత.. నేడు అమీక్ష.. ఇంటి పక్కన గొడవ జరుగుతుంది.. వచ్చి ఆపాలని డయల్‌ 100కు చిన్నారి ఫోన్‌!

27 Dec, 2022 11:35 IST|Sakshi
డయల్‌ 100కు కాల్‌ చేసిన చిన్నారి అమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: అన్నంలో పురుగులు వస్తున్నాయని ఇటీవల 4వ తరగతి విద్యార్థిని పూజిత నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. తాజాగా 2వ తరగతి చదువుతున్న మరో చిన్నారి ఇంటి పక్కన గొడవ జరుగుతుంది, వచ్చి ఆపాలని రాత్రి 11 గంటలకు డయల్‌ 100కు కాల్‌ చేసిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. ప్రశాంతిహిల్స్‌ రోడ్‌ నం–6కు చెందిన అమీక్ష (7) టీచర్స్‌కాలనీలోని భారతి స్కూల్‌లో 2వ తరగతి చదువుతోంది. ఆదివారం రాత్రి ఇంటి పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ఇద్దరి కూలీలు గొడవ పడుతున్నారు.

గొడవ జరుగుతున్నట్లు గ్రహించిన చిన్నారి అమీక్ష రాత్రి 11 గంటలకు తండ్రి సెల్‌ఫోన్‌ తీసుకొని డయల్‌ 100కు కాల్‌ చేసి ఇక్కడ గొడవ జరుగుతుంది.. వెంటనే వచ్చి గొడవను ఆపాల్సిందిగా కోరింది. బాలిక ఫిర్యాదు చేయడంతో మీర్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవ పడుతున్న ఇద్దరు కూలీలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. తొందరగా స్పందించినందుకు థ్యాంక్యూ అంకుల్‌ అని చిన్నారి చెప్పినట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. అమీక్షను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ ఏ గొడవ జరిగినా, ఆపద వచ్చినా డయల్‌ 100కు కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు.  

మరిన్ని వార్తలు