కన్నీళ్లు మిగిల్చిన వేడినీళ్లు

5 Dec, 2021 09:03 IST|Sakshi
షైనీ (ఫైల్‌)   

చలిగాలి వీచినా.. ఎండ పొడ తాకినా.. తట్టుకోలేని వయసది. అమ్మ ఒడిలో ఒదిగిపోయే ప్రాయమది. రంగుల ప్రపంచాన్ని చూడాలని ఆరాటపడే చిన్ని మనస్తత్వమది. ‘అమ్మా.. నాన్న’ ఈ రెండు పదాలు తప్ప వేరే ప్రపంచమే తెలియని చిన్ని లోకమది. ఆ లోకాన్నే ‘మా లోకం’ అని బతుకుతున్నారు తల్లిదండ్రులు. ఆ బుజ్జాయి జ్ఞాపకాల్ని కడుపులో దాచుకున్న అమ్మ.. ఆ బుజ్జి పలికిన పదాలు మనసులో మననం చేసుకున్న నాన్న. ఆ చిన్నారి షైనీ రాకతో జీవితం ‘షైన్‌’ అయిందనుకున్నారు. ఆ చిన్నారి స్నానానికి పెట్టిన వేడినీళ్లు.. జీవితాంతం కన్నీళ్లను మిగుల్చుతాయని అస్సలు అనుకోలేదు.

హసన్‌పర్తి: మండలంలోని సీతంపేటకు చెందిన బండారి అశోక్, సుజాత దంపతుల కూతురు షైనీ(3) వేడి నీళ్లలో పడి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. నవంబర్‌ 27న షైనీ స్నానం కోసమని తల్లి సుజాత ఇంటి ఆవరణలో హీటర్‌ పెట్టింది. నీళ్లు బాగా వేడి అయ్యాయని హీటర్‌ ఆఫ్‌ చేసింది. ఆ తర్వాత సుజాత వంట పనుల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలో షైనీ ఆడుకుంటూ బకెట్‌ను సమీపించింది. తప్పటడుగులేసుకుంటూ బకెట్‌ను తాకింది. ఒక్కసారిగా వేడి నీళ్లు పడడంతో గట్టిగా ఏడ్చింది. తల్లి వచ్చి చూసే సరికి షైనీ ఒళ్లు ఎర్రగా మారింది. ఏడుస్తున్న కూతురుని ఎంజీఎంకు తరలించారు. వైద్యులు వారం రోజులు చికిత్స అందించారు. శనివారం చికిత్స పొందుతున్న షైనీ మృతి చెందింది.

చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..)

ఎమ్మెల్యే పరామర్శ
బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ పరామర్శించారు.  çఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక సర్పంచ్‌  జనగాం శరత్, ఎంపీటీసీ సభ్యురాలు బండారి రజిత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బండి రజనీకుమార్, టీఆర్‌ఎస్‌ నాయకులు చేరాలు, తిరుపతి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ భగవాన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ భగవాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు