ఫ్లూ మాదిరిగా ఇకపై ఏటా కరోనా ప్రభావం

26 Aug, 2021 14:29 IST|Sakshi

వచ్చే నెలలో థర్డ్‌ వేవ్‌ రావడం ఖాయం

ఫస్ట్, సెకండ్‌ వేవ్స్‌ అంత తీవ్రత ఉండదు

నవంబర్‌ దాకా కొనసాగనున్న ప్రభావం

‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో నియోనాటల్, పీడియాట్రిక్‌

క్రిటికల్‌కేర్‌ నిపుణుడు డా.సతీశ్‌ ఘంటా 

సాక్షి, హైదరాబాద్‌: ‘సాధారణ ఫ్లూ మాదిరిగానే కరోనా ఏటా మన తలుపులు తడుతుంది. ఇకపై కరోనా వైరస్‌తో సహజీవనం చేయాల్సిందే. ఫ్లూ, ఇతర సీజనల్‌ జబ్బులు కూడా పూర్తిగా నిర్మూలన కాకపోగా ఏటా వర్ష, చలికాలాల్లో వస్తూనే ఉన్నాయి. కోవిడ్‌ కూడా త్వరలోనే థర్డవేవ్‌ రూపంలో, ఆపై ఏటా వస్తూనే ఉంటుంది. మనం సంసిద్ధంగా ఉండాల్సిందే’అని నియోనాటల్, పీడియాట్రిక్‌ క్రిటికల్‌కేర్‌ నిపుణుడు, లిటిల్‌ స్టార్స్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డా.సతీశ్‌ ఘంటా స్పష్టం చేశారు. ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో కరోనా థర్డ్‌ వేవ్‌ తదితర అంశాల గురించి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 


లిటిల్‌ స్టార్స్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డా.సతీశ్‌ ఘంటా

సాక్షి: థర్డ్‌వేవ్‌పై ఏమంటారు? 
డా.సతీశ్‌: వచ్చే నెలలో థర్డ్‌వేవ్‌ రావడం ఖా యం. అయితే ఫస్ట్, సెకండ్‌ వేవ్స్‌ ఉన్నంత గా ప్రభావం ఉండకపోవచ్చు. నవంబర్‌ వర కు దాని ప్రభావం కొనసాగే అవకాశాలున్నాయి. 
చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోం: ఆఫీస్‌లకు శాశ్వతంగా గుడ్‌బై! 

సాక్షి: ఈ వేవ్‌ ఎలా ఉండబోతోంది? 
డా.సతీశ్‌: ఫస్ట్‌ వేవ్‌లో చాలా మందిపై ప్రభావం పడగా, సెకండ్‌వేవ్‌లో యువత, మధ్య వయస్కులపై అధిక ప్రభావం పడింది. చిన్నపిల్లలు, 18 ఏళ్ల లోపు వారు సైతం కొంతమేర ప్రభావితమయ్యారు. నేటికీ నెలల వయసు పిల్లల దగ్గర నుంచి 15, 16 ఏళ్ల వయసున్న వారి పాజిటివ్‌ కేసులొస్తున్నాయి. కానీ అంత సీరియస్‌గా మారట్లేదు. ఇప్పుడు ఏ వయసు పిల్లలు.. ఎలాంటి లక్షణాలతో బాధపడుతున్నారు.. వారికి ఎలాంటి చికిత్స అందించాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఏర్పడటంతో సరైన చికిత్సకు అవకాశం కలిగింది. థర్డ్‌వేవ్‌ వచ్చేటప్పటికి వైరస్‌ తీవ్రత, ప్రభావం తక్కువగానే ఉండొచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

సాక్షి: స్కూళ్లు తెరవాలనే డిమాండ్‌ బాగా పెరుగుతోంది. తెరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 
డా.సతీశ్‌: స్కూళ్లలో పనిచేసేవారంతా తప్పనిసరిగా టీకా తీసుకోవాలి. సిబ్బందికి కరోనా జాగ్రత్తలు, ఇతర చర్యలపై పూర్తి శిక్షణ ఇవ్వాలి. శానిటైజేషన్‌ ఇతర శుభ్రతా చర్యలు తీసుకోవాలి. పిల్లలు దూరంగా కూర్చునేలా సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ మార్చాలి. తరగతి గదుల్లో గాలి, వెలుతురు ఎక్కువగా ఉండేలా చూడాలి. టీచర్లు, సిబ్బంది, పిల్లల్లో ఎవరికి కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయాలి. మాస్కులు, ఇతర జాగ్రత్తలు కచి్చతంగా పాటిస్తూ స్కూళ్లు తెరిస్తే మంచిదే. 

సాక్షి: యాంటీబాడీస్, రోగనిరోధక శక్తి ఎలా ఉంటోంది? 
డా.సతీశ్‌: కోవిడ్‌ వచ్చి తగ్గాక ఏర్పడే యాంటీబాడీస్‌ కొందరిలో 3, 4 నెలల పాటే ఉంటున్నాయి. దీంతో వారు మళ్లీ వైరస్‌ బారినపడుతున్నారు. ఇలాంటి కేసులు కూడా ఇటీవల పెరుగుతున్నాయి. చిన్నప్పుడు అమ్మవారు, తట్టు వంటివి వచ్చి పోయాక మళ్లీ వచ్చేవి కావు. మన శరీరంలోని రోగనిరోధకశక్తి జీవితమంతా రక్షణ కలి్పస్తుండగా, కరోనా వైరస్‌ మాత్రం ఆ అవకాశం ఇవ్వట్లేదు. కోవిడ్‌ సోకాక ఏర్పడే యాంటీబాడీస్‌తో పాటు రోగనిరోధకశక్తి కొంతకాలం మాత్రమే ఉంటోంది. 

సాక్షి: ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? 
డా.సతీశ్‌: దేశంలో దాదాపు 60 శాతం మందికి కరోనా వచ్చి పోయినట్లు తాజా సీరో పాజిటివిటీ సర్వేలో తేలింది. అయితే టీకాలు తీసుకోని 18 ఏళ్లలోపు పిల్లల జనాభా 25 నుంచి 30 శాతం దాకా ఉంటుంది. ఇంకా 20 శాతం వయోజనులు వ్యాక్సిన్‌ వేసుకోలేదు. ఇప్పుడు వారిపై థర్డ్‌వేవ్‌ ప్రభావం చూపే అవకాశాలున్నాయి. సెకండ్‌వేవ్‌లో లాక్‌డౌన్‌ ఉన్నప్పుడు కేసులు తగ్గినా ఇప్పుడు కూడా పాజిటివ్‌ కేసులు పూర్తిగా తగ్గలేదు. 

సాక్షి: ఇప్పుడు జాగ్రత్తలు పాటిస్తున్నారా? 
డా.సతీశ్‌:
మాస్క్‌లు, భౌతిక దూరం, గుంపులుగా చేరకపోవడం, గాలి, వెలుతురు లేని చోట ఎక్కువ సేపు గడపకపోవడం వంటివి అందరూ పాటిస్తే స్కూళ్లు తెరవడంతో పాటు అన్ని కార్యకలాపాలు యథావిధిగా నిర్వహించుకోవచ్చు. సుదీర్ఘకాలం పాటు ఆంక్షలు, నిబంధనలతో అధిక శాతం ప్రజలు విసిగిపోయి ఉన్నారు. దాంతో జాగ్రత్తలు పాటించట్లేదు. టీచర్లందరికీ టీకాలు వేసి ఉంటే పిల్లల మధ్య తగిన దూరం పాటిస్తూ పాఠాలు కొనసాగించొచ్చు. 

మరిన్ని వార్తలు