ప్రభుత్వ జాగా.. వేసేయ్‌ పాగా!

23 Jun, 2021 07:58 IST|Sakshi

సాక్షి, చెన్నూర్‌(మంచిర్యాల): ప్రభుత్వ జాగా కన్పిస్తే చాలు కొందరు అక్రమార్కులు పాగా వేస్తున్నారు. చెన్నూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పటికే అన్యాక్రాంతమైంది. రోజురోజుకూ ప్రభుత్వ భూములు కబ్జాకోరుల చేతుల్లోకి వెళ్తున్న అధికారులు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెన్నూర్‌ పట్టణ సమీపంలోని గెర్రె కాలనీతో పాటు 63వ జాతీయ రహదారి పక్కన, బావురావుపేట వెళ్లే రహదారి,  కత్తరశాల రోడ్డులోని 869 సర్వే నంబర్‌లో సుమారు రెండు వందల  ఎకరాలకు పైగా ప్రభుత్వ అసైన్డ్‌ భూమి ఉంది. కొందరు రియాల్టర్లు ప్రభుత్వ స్థలాల్లో ముందుగా అక్రమార్కులు చిన్నచిన్న షేడ్లు నిర్మించి స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో పక్క నిర్మాణాలు చేపడుతున్నారు. అనంతరం రియల్‌ దందాకు తెరతీస్తున్నారు. ఈ వ్యవహారం కొందరు అధికారులు కనుసన్నల్లోనే  జరుగుతుందనే ఆరోపణలు లేకపోలేదు.. విలువైన వందలాది ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

భూముల ధరలకు రెక్కలు...
గెర్రె కాలనీ సమీపంలోని భూముల ధరలకు రెక్కలచ్చాయి. గతంలో పది వేలకు గుంట ధర పలుకని భూమి 63వ జాతీయ రహదారి నిర్మాణంతో భూముల ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం గెర్రెకాలనీ సమీపంలో గుంట భూమి ధర రూ.10 లక్షలకు పైగా  పలుకుతోంది. దీంతో అక్రమార్కులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఖాళీ స్థలం కన్పిస్తే చాలు కబ్జా చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. 

నిర్మాణాలకు అనుమతి ఎలా..?
పట్టా భూములతో పాటు రిజిస్ట్రేషన్‌ స్థలాలు గల వారు ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు మున్సిపాలిటీ నుంచి అనుమతి లభించాలంటే నెల నుంచి రెండు నెలలు పడుతుంది. ప్రభుత్వ స్థలాల్లో ఇంటి నిర్మాణాలకు మున్సిపాలిటీ అధికారులు అనుమతి ఎలా ఇస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. మున్సిపాలిటీ ఏర్పడకముందు చెన్నూర్‌లోని అన్ని భూములు అబాది భూములే ఉన్నాయి. 100 ఏళ్లకు పైగా నిర్మాణాలు కలిగి ప్రస్తుతం మున్సిపాలిటీ రికార్డల్లో ఆ ఇంటి నంబర్లు ఉన్నప్పటికీ పాత ఇంటి స్థలాల్లో ఇంటి నిర్మాణాలు చేపడితే మున్సిపాల్‌ అధికారులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ అసైన్డ్‌ భుముల్లో ఇంటి నిర్మాణాలకు ఏ ప్రతిపాదికన అనుమతి ఇస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. చెన్నూర్‌ పట్టణంలోని జెండవాడకు చెందిన సమ్మయ్య అనే వ్యక్తి తనకున్న అబాది భూమిలో ఇంటి నిర్మాణం కోసం మున్సిపాలిటీకి  రూ.10వేల  పన్ను చెల్లించి నిర్మాణం చేపట్టాడు. అబాది భూముల్లో ఇంటి నిర్మాణానికి ముందుగా అనుమతించిన మున్సిపాల్‌ అధికారులు ఇటీవల అడ్డుకున్నారు. గెర్రె, జాతీయ రహదారి, కత్తరశాల రోడ్డులలో రెండంతస్తులు భవనాలు నిర్మిస్తున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

కట్టడాలు నిలిపివేస్తున్నాం
ప్రభుత్వ అసైన్డ్‌ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటున్నాం. నా దృష్టికి వచ్చిన నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశాం. అక్రమ నిర్మాణాల విషయంలో లాలూచి పడినట్లు ఆరోపణలు వచ్చిన ఇద్దరు వీఆర్‌ఏలను సస్పెండ్‌ చేశాం. అక్రమాలను పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేదిలేదు.

–జ్యోతి, తహసీల్దార్, చెన్నూర్‌

మరిన్ని వార్తలు