స్థానిక ప్రజాప్రతినిధుల వేతనం 30శాతం పెంపు

29 Sep, 2021 03:06 IST|Sakshi

సీఎంకు ఎర్రబెల్లి కృతజ్ఞతలు

చిత్తశుద్ధికి నిదర్శనమని హరీశ్‌రావు ట్వీట్‌

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులు (ఎంపీపీ), జిల్లా పరిషత్‌ ప్రాదేశిక సభ్యుల (జెడ్పీటీసీ) గౌరవ వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.13 వేలకు, మండల పరిషత్‌ ప్రాదేశిక సభ్యులు (ఎంపీటీసీ), గ్రామ సర్పంచుల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.6,500 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు పీఆర్‌ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంపు పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పీఆర్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. జూన్‌ నెల నుంచే పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయని తెలియజేశారు. కాగా, స్థానిక సంస్థలను బలోపేతం చేసి గ్రామీణాభివృద్ధిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీ మేరకు ఈ పెంపుదల జరిగిందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.  

ఆత్మగౌరవం నిలబెట్టేందుకు ప్రత్యేకగ్రాంట్‌
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవం నిలబెట్టేందుకు నిధుల విడుదలతో పాటు ప్రత్యేక గ్రాంట్‌ కేటాయించాలని సీఎం కేసీఆర్‌కు ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి కోరారు. స్థానిక ప్రతినిధుల గౌరవ వేతనం పెంపు, స్థానికసంస్థల బలోపేతంపై కౌన్సిల్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చర్చించడం సంతోషదాయకమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

స్థానిక సంస్థలు బలోపేతం: కవిత 
జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌ల గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తంచేశారు. వేతనాల పెంపుతో స్థానికసంస్థలు బలోపేతం కావడంతో పాటు సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వేతనాల పెంపు ఉత్తర్వులు జారీచేయడం పట్ల సీఎం కేసీఆర్‌కు కవిత కృతజ్ఞతలు తెలిపారు.  

మరిన్ని వార్తలు