Electrical Vehicle: మేడిన్‌ జనగామ

12 Jul, 2021 16:27 IST|Sakshi

Janagaon Electric Bike: పెరుగుతున్న పెట్రోలు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత రెండు నెలలుగా దాదాపు రోజు విడిచి రోజు పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరిగిన ధరలతో కొందరు తమ వాహనాలను మూలన పడేయగా మరికొందరు ప్రత్యామ్నాయాలను చూసుకున్నారు. కానీ జనగామకు చెందిన విద్యాసాగర్‌ విభిన్నమైన మార్గం ఎంచుకున్నాడు. 


జనగామకు చెందిన కూరపాటి విద్యాసాగర్‌ ఓ ఎలక్ట్రానిక్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోలు ధరలు భారంగా మారాయి. జనగామలో కూడా పెట్రోలు ధర లీటరు వంద దాటింది.

పెట్రోలు ధరలు పెరగడమే తప్ప తగ్గకపోవడంతో తన భైకుకు ఉన్న పెట్రోల్‌ ఇంజన్‌ను తీసేయాలని నిర్ణయించుకున్నాడు.

రూ.10 వేల ఖర్చుతో 30ఏహెచ్‌ కెపాసిటీ కలిగిన నాలుగు బ్యాటరీలు కొనుగోలు చేశారు. 


ఆ తర్వాత రూ.7500 ఖర్చు చేసి  ఆన్‌లైన్‌లో మోటారు కొన్నాడు.


స్థానిక మెకానిక్‌ అనిల్‌ సహకారంతో పెట్రోల్‌ ఇంజన్‌ స్థానంలో బైక్‌కి బ్యాటరీలు, మోటార్‌ అమర్చాడు. ఈ లోకల్‌ మేడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ 5 గంటలపాటు ఛార్జింగ్‌ పెడితే 50 కిలోమీటర్ల ప్రయాణిస్తోంది. బ్యాటరీలతో నడుస్తున్న విద్యాసాగర్‌ బైక్‌ ఇప్పుడు జనగామలో ట్రెండింగ్‌గా మారింది. 


బ్యాటరీలను ఛార్జింగ్‌ చేసుకోవడానికి ఒకటి నుంచి ఒకటిన్నర యూనిట్‌ కరెంటు ఖర్చవుతోంది, కేవలం రూ.10తో 50 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నా. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలకు ప్రత్యామ్నాయంగా ఈ ఆలోచన చేశాను - విద్యాసాగర్‌

మరిన్ని వార్తలు