కడుపు నింపని ‘టిఫిన్‌ డబ్బా’

23 May, 2021 18:18 IST|Sakshi

కరోనా కష్టాలు-టిఫిన్‌ వాలా

రహదారులపై మొబైల్‌ టిఫిన్‌వాలాల ఎదురుచూపులు 

లాక్‌డౌన్‌తో కుదేలైన వ్యాపారం  

గ్రేటర్‌లో సుమారు 5 వేల మందికిపైగా టిఫిన్‌వాలాలు 

ఉపాధి లేక సొంతూళ్లకు వెళ్తున్న వైనం 

సాక్షి, సిటీబ్యూరో: నగరం నలువైపులా కనీసం 5 వేల మందికి పైగా చిరువ్యాపారులు టీవీఎస్‌ మోపెడ్‌లపైన మొబైల్‌ టిఫిన్‌ సెంటర్లను నడుపుతున్నారు. ఇప్పుడు వీరి ఉపాధిని కోవిడ్‌ దెబ్బతీసింది. మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో అన్ని రంగాలు కుదేలయ్యాయి. జనం రోడ్లపైకి రావడం లేదు. దీంతో మోపెడ్స్‌పైన విక్రయించే ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఉప్మా, వడ ఆరగించే వినియోగదారులు లేరు. ‘ఏడాది నుంచి  ఇవే కష్టాలు. గతేడాది కరోనా తగ్గిన తరువాత  కొద్దిగా వ్యాపారాలు  గాడిన పడ్డాయనిపించింది. కానీ  సెకెండ్‌ వేవ్‌తో మొత్తం పడిపోయింది.  

రహదారులే అడ్డాలు.... 
హైటెక్‌సిటీ, నార్సింగ్, మణికొండ, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు, ఉప్పల్, ఈసీఐఎల్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, తదితర నగరం నలువైపులా ఉన్న రహదారులను ఆశ్రయించుకొని ఈ టూవీలర్‌ మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌లు పని చేస్తున్నాయి. ఎక్కడ ఓ పది మంది జనం గుమిగూడేందుకు అవకాశం ఉంటే అక్కడ వాళ్లు ఉంటారు. రూ.15లకే రుచికరమైన శుభ్రమైన టిఫిన్‌తో కడుపు నింపేస్తారు. ఇందుకోసం ఇంటిల్లిపాది రాత్రింబవళ్లు కష్టపడుతారు. ఉదయం 6 గంటలకే అడ్డాలపైకి వచ్చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు  టిఫిన్‌లు సప్‌లై చేస్తారు. రోజుకు కనీసం వంద మందికి సరిపడా టిఫిన్‌లు సిద్ధం చేస్తారు. అలాంటి టిఫిన్‌ సెంటర్‌లు ఇప్పుడు కోవిడ్‌ దెబ్బకు విలవిలాడుతున్నాయి. ఇంటిల్లిపాది ఉపాధిని కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. 

‘ఉప్పల్‌ నుంచి తార్నాక వైపు వెళ్లే మార్గంలో హబ్సిగూడ జెన్‌ప్యాక్‌ వద్ద  వివిధ రకాల అల్పాహారాలతో ఎదురు చూస్తున్న  ఈ యువకుడి పేరు రంజిత్‌. ఇంటర్‌తోనే చదువు ఆగిపోయింది. దీంతో ఉపాధి కోసం రంజిత్‌తో పాటు అతని తండ్రి కూడా ఇలా మోపెడ్‌పై మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌ నడిపిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పుడు వీరికి వ్యాపారం పూర్తిగా పడిపోయింది. గిరాకీలు లేక ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.’  

‘ఇల్లు గడవక నా చదువు ఆగిపోయింది. కోవిడ్‌ కారణంగా తమ్ముడి  చదువులు అటకెక్కాయి. అందరం కలిసి ఏదో ఒక పని చేసుకొని బతుకొచ్చులే అనుకున్నాం. నాన్న, నేను టిఫిన్‌ డబ్బాలు పెట్టుకొని తిరుగుతున్నాం. మొదట్లో బాగానే గడిచింది. కానీ ఏడాది నుంచి కష్టాలు మొదలయ్యాయి. కోవిడ్‌ కారణంగా జెన్‌ప్యాక్‌ ఉద్యోగులు రావడం లేదు. గత సంవత్సరం లాక్‌డౌన్‌ దెబ్బతీసింది. ఇప్పుడు 10 గంటల వరకు సడలింపు ఉన్నా జనం రోడ్లమీదకు రావడం లేదు. బయట టిఫిన్‌లు చేసేవాళ్లు కూడా తగ్గారు. జీవితం అస్తవ్యస్తమయ్యింది. ఈ గడ్డుకాలం ఇంకెన్నాళ్లు ఉంటుందో ఏమో..’అని రంజిత్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు