-

Hyderabad: ‘చుక్క’ కోసం వారు.. ‘ముక్క’ కోసం వీరు.. 

24 May, 2021 09:59 IST|Sakshi

 లాక్‌డౌన్‌ దృష్ట్యా ఉదయం 5 గంటల నుంచే దుకాణాల ముందు బారులు 

 కిక్కిరిసిపోయిన వైన్స్, నాన్‌వెజ్‌ దుకాణాలు

 గడువు ముంచుకొస్తుందని ఉరుకులు.. పరుగులు..

 ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్‌  నియంత్రణలో పోలీసులు

బంజారాహిల్స్‌: అసలే ఆదివారం.. ఉన్నది నాలుగు గంటల సమయం.. ఏమాత్రం ఆలస్యం చేసినా లాక్‌డౌన్‌ గడువు ముంచుకొస్తుంది. ఉన్న సమయంలోనే కావాల్సిన సరుకు కొనుక్కోవాలి. అందుకోసం ఎంత కష్టమైనా.. ఎంత దూరమైనా.. వెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలోనే అటు మటన్, చికెన్, ఫిష్‌ తదితర నాన్‌వెజ్‌ షాపుల ముందు ఇటు మద్యం షాపుల ముందు జనం బారులు తీరారు. 

మందు కోసం... 

  • ఉదయం 5 గంటలకే పలువురు మద్యం షాపుల వద్ద క్యూ కట్టారు. తెరవగానే సరుకు కొనుగోలు చేసి వెళ్లిపోవాలన్నది వీరి ఉద్దేశం. 
  • ఆలస్యమైతే లాక్‌డౌన్‌ గడువు ముంచుకొచ్చే ప్రమాదం ఉండటంతో చాలా మంది ఈ 4 గంటల్లోనే మద్యం కొనుగోలుకు బారులు తీరారు. 
  •  దీంతో ప్రతి వైన్‌షాపు ముందు ఇలాంటి క్యూలైన్లు కనిపించాయి. 
  • నాలుగు గంటల్లోనే వైన్‌షాపులు లక్షలాది రూపాయలు విలువ చేసే మద్యాన్ని విక్రయించాయి.

నాన్‌వెజ్‌ కోసం.. 

  • ఇక ఆదివారం అంటే నాన్‌వెజ్‌ ఉండాల్సిందే. ఇందు కోసం దాదాపు అన్ని మటన్‌ షాపుల ముందు తెల్లవారుజాము నుంచే మాంసాహార ప్రియులు క్యూ కట్టారు. 
  • పంజగుట్టలోని మటన్‌షాపు ముందు తెల్లవారుజామున 4 గంటలకే జనం రావడంతో కిలోమీటరు దూరం క్యూ కనిపించింది. 
  • ముందుగానే టోకెన్‌ తీసుకోవడానికి ఒక క్యూలైన్, టోకెన్‌ తీసుకున్నాక మటన్, చికెన్‌ తీసుకోవడానికి ఇంకో క్యూలైన్‌ ఇలా రెండు క్యూలైన్లను పాటించాల్సి వచ్చింది.
  • అయినా సరే ఇక్కడ నాలుగు గంటల్లోనే 1800 మంది చికెన్, మటన్‌లను కొనుగోలు చేశారు. 
  • ఇక చేపలు విక్రయించే మార్కెట్లలో జనం కిటకిటలాడారు. 
  • బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–10లోని చేపల విక్రయ కేంద్రంతో పాటు అమీర్‌పేట చేపల మార్కెట్‌లో ఉదయం 8.30 గంటలకే చేపలు అయిపోవడంతో చాలా మంది ఉసూరుమంటూ వెనుతిరిగారు. తప్పేది లేక చికెన్‌ తీసుకున్నామని ప్రశాంత్‌రెడ్డి అనే బంజారాహిల్స్‌ నివాసి వెల్లడించాడు. చేపల కోసం అమీర్‌పేట వెళ్లగా అక్కడ అయిపోయాయని వెల్లడించాడు. 
  • చింతల్‌బస్తీ, ఖైరతాబాద్, ఇందిరానగర్, పంజగుట్ట, అమీర్‌పేట మార్కెట్లు ఉదయం 4 గంటలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. 

పోలీసుల బందోబస్తు.. 

  • నిత్యావసరాలు, మద్యం, నాన్‌వెజ్‌ను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున బయటకు వచ్చిన వారిని నియంత్రించేందుకు ఎక్కడికక్కడ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 
  • ఉదయం 10 గంటలకు లాక్‌డౌన్‌ ప్రారంభ సమయానికి ఇళ్లకు చేరుకునే క్రమంలో ఒక్కసారిగా వాహనదారులు రోడ్లపైకి రావడంతో గంట పాటు ప్రధాన కూడళ్లు, లాక్‌డౌన్‌ చెక్‌పోస్ట్‌ల వద్ద ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. వీరిని నియంత్రించడానికి పోలీసులకు చెమటలు పట్టాయి. 
  • మొత్తానికి ఆదివారం పోలీసులకు పరీక్ష పెట్టగా.. కొనుగోలుదారులకు చెమటలు పట్టాయి.
    చదవండి: Hyderabad Chaiwalas: అప్పు తెచ్చి అద్దె కట్టాలి.. ఎట్ల బత్కాలె?
మరిన్ని వార్తలు