లాక్‌డౌన్‌: అమ్మలా.. ఆకలి తీరుస్తున్నాడు

25 May, 2021 13:12 IST|Sakshi
చేతులు లేని వ్యక్తికి అన్నం తినిపిస్తున్న యువకుడు

లాక్‌డౌన్‌ వేళ స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు

కోవిడ్‌ బాధితులకు గుడ్డు, అరటిపండ్లు, మందులు అందిస్తూ.. 

సాక్షి, వనపర్తి: కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. దీంతో కోవిడ్‌ బాధితులతో పాటు సహాయకులకు భోజనం అందక పస్తులుండాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో రెండు పూటలా భోజనంతో పాటు బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ అండగా మేమున్నామంటూ జిల్లాకేంద్రానికి చెందిన పలువురు భరోసా కల్పిస్తున్నారు. అమ్మలా ఆకలి తీరుస్తున్నారు. నవోదయ ఓల్డేజ్‌ హోం ఆధ్వర్యంలో పలువురు యువకులు కరోనా బాధితులతో పాటు ఆస్పత్రికి వచ్చే రోగులు, యాచకులకు రోజు అన్నం ప్యాకెట్లతో పాటు గుడ్డు, అరటిపండు అందిస్తున్నారు.

5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాధితులకు సైతం ప్రత్యేక వాహనంలో వెళ్లి పంపిణీ చేస్తున్నారు. సెల్‌నంబర్‌ 9052507793కు కాల్‌ చేసి బాధితుల వివరాలు తెలియజేస్తే అందించేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్వాహకుడు రాము తెలిపారు. జిల్లాకేంద్రానికి చెందిన జర్నలిస్టు రహీం 12 రోజులుగా రాత్రిళ్లు రోడ్లపై ఉండే యాచకుల కడుపు నింపుతున్నారు. ఆయన సేవలను గుర్తించిన డీఎస్పీ కిరణ్‌కుమార్‌ తనవంతుగా రూ.7 వేల సాయం అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో రహీం స్నేహితులు కూడా తమవంతు సాయం అందిస్తున్నారు. 


 ఆహార ప్యాకెట్లను సిద్ధం చేస్తున్న నవోదయ ఓల్టేజ్‌ హోం నిర్వాహకులు  

జనరల్‌ ఆస్పత్రిలో కోవిడ్‌ బాధితులకు భోజనాలు 
బ్రహ్మంగారికాలనీ మిత్రబృందం వారు స్వయంగా వంట చేసి ఆహార ప్యాకెట్లను జిల్లా ఆస్పత్రిలోని కోవిడ్‌ బాధితులు, రోగులకు మధ్యాహ్నం సమయంలో అందజేస్తూ ఆకలి తీరుస్తున్నారు. కాలనీ యువకుల సహకారంతో వారం రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. ప్రతి ఆదివారం మాంసాహారం అందించనున్నట్లు కౌన్సిలర్‌ బ్రహ్మం తెలిపారు. రోజూ 200 మందికి భోజనం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలోనూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.

మరిన్ని వార్తలు