లాక్‌డౌన్‌పై 48 గంటల్లో చెప్పండి?

20 Apr, 2021 01:42 IST|Sakshi

నియంత్రణ చర్యలేవి..?

లాక్‌డౌన్‌.. రాత్రి కర్ఫ్యూపై 48 గంటల్లో చెప్పండి

లేదంటే మేమే ఆదేశాలిస్తాం.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక

ఢిల్లీ లాంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నారా?

కరోనా నియంత్రణ చర్యల్లో ఉదాసీనత ఎందుకు?

జనం గుమిగూడే ప్రదేశాలు, కార్యక్రమాలపై ఆంక్షలు పెట్టండి

పబ్స్, మాల్స్, హోటల్స్, సినిమా హాల్స్‌కు పరిమితి విధించండి

వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోండి

22లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం.. విచారణ 23కు వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్, నైట్‌ కర్ఫ్యూ, వారాంతపు కర్ఫ్యూ విధించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుంటే.. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తామే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించింది. జనం గుమిగూడే ప్రదేశాలు, కార్యక్రమాలపై ఆంక్షలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, కరోనా నియంత్రణ చర్యలను ఈ నెల 22లోగా నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశిం చింది. ఈ మేరకు విచారణను 23వ తేదీకి వాయిదా వేసింది.

రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలంటే కొంత కష్టమని, మరికొంత గడువు ఇవ్వాలని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించగా.. ‘‘గడువు ఇవ్వబోం.. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు. ఏప్రిల్‌ 8న ఇచ్చిన ఆదేశాలను 10 రోజులైనా అమలు చేయలేదు. ఆదేశాల అమలుకు 240 గంటల సమ యం సరిపోలేదా?’’ అని నిలదీసింది.

ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. క్లబ్బులు, పబ్స్, మాల్స్, సినిమా థియేటర్స్, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌లో పరిమిత సంఖ్యలో జనాన్ని అనుమతించేలా ఎందుకు ఆదేశాలు జారీచేయడం లేదని ప్రశ్నించింది. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలకన్నా ఆదాయమే ముఖ్యమా అని మండిపడింది.

సర్కారు చర్యలపై అసంతృప్తి
కరోనా విజృంభిస్తోందని, నియంత్రణ చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ.. ఆర్‌.సమీర్‌ అహ్మద్, న్యాయవాది పి.తిరుమలరావు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత విచారణ సందర్భంగా తామిచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని, తాము కోరిన ఏ సమాచారం కూడా ఇవ్వలేని అసహనం వ్యక్తం చేసింది.

రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతున్నా.. కరోనా నియంత్రణ చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ మండిపడింది. అరకొర సమాచారంతో అసమగ్రంగా నివేదిక సమర్పించారంటూ కేసు విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఆలోగా వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భోజన విరామం తర్వాత వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఇద్దరూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు.

ఢిల్లీలాంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నారా? 
నిత్యం వేల కరోనా కేసులతో ఢిల్లీ భయానక పరిస్థితి ఎదుర్కొంటోందని, ఢిల్లీ లాంటి పరిస్థితి తెలంగాణలో రావాలని కోరుకుంటున్నారా అని ఉన్నతాధికారులను ధర్మాసనం నిలదీసింది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించిందని, ఇక్కడ మాత్రం ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు చేపట్టడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడింది. ఉప ఎన్నికల నేపథ్యంలో ర్యాలీలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల కార్యక్రమాలకు పరిమిత సంఖ్యలోనే జనం హాజరుకావాలన్న నిబంధన ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించింది.

ఆదేశాలను అమలు చేయలేదేం? 
ఆర్టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్య పెంచాలని.. రాష్ట్ర సరిహద్దుల్లో తప్పనిసరిగా కరోనా టెస్టింగ్‌ కేంద్రాలు పెట్టాలని, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, అంతర్రాష్ట్ర బస్‌స్టేషన్లలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని కోరామని ధర్మాసనం గుర్తు చేసింది. అయినా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని మండిపడింది. మైక్రో, కంటైన్‌మెంట్‌ జోన్లను ప్రకటించాలని.. వాటిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని చెప్పినా ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది.

జిల్లాల వారీగా కేసుల సంఖ్య, అందులో లక్షణాలున్న వారెందరు, లక్షణాల్లేని వారెందరు, మరణాలు ఎన్ని, కోలుకున్న వారెందరు, చికిత్స పొందుతున్నది ఎందరన్న వివరాలు ఇవ్వాలని అడిగినా.. అసమగ్రంగా నివేదిక సమర్పించారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించినా.. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినా పోలీసు యంత్రాంగం ఆశించిన స్థాయిలో పనిచేయలేదని పేర్కొంది.

14 ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు నివేదికలో పేర్కొన్నా.. ఎప్పటిలోగా ఏర్పాటవుతాయన్నది పేర్కొనలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. రెండు, మూడు వారాల్లో ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెస్తామని, రాష్ట్రవ్యాప్తంగా 49 కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ కార్యదర్వి రిజ్వీ ధర్మాసనానికి నివేదించారు. 2

73 మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేశామని, ఈ సమాచారాన్ని వైద్యారోగ్య శాఖ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. పాజిటివ్‌ వారిలో 80 శాతం మందికి లక్షణాలే ఉండడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయన్న వివరాలను కూడా ఎప్పటికప్పుడు వెబ్‌సైట్లో అప్‌డేవ్‌ చేస్తున్నామన్నారు. దీనిపై స్పందించిన బెంచ్‌ పలు ఆదేశాలు జారీ చేసింది.

 ఈ వివరాలతో నివేదిక ఇవ్వండి
‘‘ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ఫలితాలను ఎన్ని గంటల్లో ఇస్తున్నారు.. వృద్దులు, వికలాంగులు, అనాథలు కరోనా బారినపడకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎక్స్‌పర్ట్‌ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? పలుచోట్ల కుటుంబాలు మొత్తంగా కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో.. అలాంటి వారికి ఉచితంగా లేదా నామమాత్రపు ధరకు ఆహారం అందించేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? రాష్ట్రవ్యాప్తంగా మందుల సరఫరాలో ఇబ్బందులు రాకుండా ఎటువంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు? ఆక్సిజన్‌ నిల్వల కొరత రాకుండా ఏం చేస్తున్నారు?’’ తదితర వివరాలతో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

మరిన్ని వార్తలు