తెలంగాణలో భారీగా లాక్‌డౌన్‌ సడలింపులు!

17 Jun, 2021 01:35 IST|Sakshi

రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కఠినంగా కర్ఫ్యూ

20వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం

వ్యాపారాలకు అనుమతి కరోనా కేసులు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ యోచన

ఆదాయం పెంచుకోవడంపైనా సర్కారు దృష్టి

18న నిర్ణయం తీసుకునే అవకాశం

  • ఈ నెల 19తో ప్రస్తుత లాక్‌డౌన్‌ ఉత్తర్వుల గడువు ముగియనుంది. 20వ తేదీ నుంచి సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 
  • పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
  • రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలుపై కేబినెట్‌ భేటీలో సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం. లేదా మంత్రులతో మాట్లాడి ప్రకటన.
  • సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో మరో 10 రోజుల పాటు ప్రస్తుత విధానంలోనే లాక్‌డౌన్‌ అమలు చేసేలా నిర్ణయం తీసుకునే అవకాశముంది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా రెండో వేవ్‌ తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరిం త సడలించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం సడలింపులో భాగంగా ఉదయం 6 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకు అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలను అనుమతించడంతో పాటు ఆ తర్వాత ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి మరో గంట సమ యం ఇస్తున్నారు. ఇక సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. అయితే ఈ నెల 19వ తేదీతో ప్రస్తుత లాక్‌డౌన్‌ ఉత్తర్వుల గడువు ముగియనుండటంతో, ఆ తర్వాత రాత్రి కర్ఫ్యూ మాత్రమే కొనసాగించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సడలింపు సమయాన్ని పొడిగించి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలను అనుమతించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబు తున్నాయి. ప్రజలు తమ గమ్య స్థానాలకు చేరుకోవడానికి రాత్రి 10 వరకు వెసులుబాటు కల్పించి, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం.

వాణిజ్య కార్యకలాపాలకు ఊపు
రాష్ట్రంలో కరోనా రెండో వేవ్‌ కట్టడికి గత నెల 12వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.4,100 కోట్ల ఆదాయ నష్టం జరిగినట్టుగా అంచనా వేశామని మూడు రోజుల కిందట రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. బుధవారం నాటికి రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,489కి తగ్గింది. ఈ పరిస్థితుల్లోనే లాక్‌డౌన్‌ను మరింత సడలించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. తద్వారా రాష్ట్రంలో మళ్లీ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఊపు కల్పించాలని భావిస్తోంది. ఈనెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ నెల 20, 21 తేదీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్‌ జిల్లాల పర్యటనకు వెళ్లాల్సి ఉంది. బుధవారం ఆయన గజ్వేల్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉండడంతో అక్కడి నుంచే నేరుగా జిల్లాల పర్యటనకు వెళ్లే అవకాశం కూడా ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే జరిగితే సీఎం స్వయంగా మంత్రులతో ఫోన్‌లో మాట్లాడి, వారి అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం ఒక ప్రకటన ద్వారా లాక్‌డౌన్‌ సడలింపుపై తన నిర్ణయాన్ని వెల్లడించవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక్కడ సడలింపులు లేనట్లే..
కరోనా పూర్తిగా అదుపులోకి రాలేదన్న కారణంతో సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో కొత్త సడలింపులు లేకుండా లాక్‌డౌన్‌ను యథాతథంగా అమలు చేయాలని చివరిసారిగా ఈ నెల 8న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్‌డౌన్‌ సడలించి, మధ్యాహ్నం 2 గంటల వరకు ఇళ్లకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. కాగా బుధవారం కూడా నల్లగొండ జిల్లాలో 131, ఖమ్మం జిల్లాలో 118, సూర్యాపేట జిల్లాలో 82 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ (175) తర్వాత అత్యధిక కేసులు నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడు నియోజకవర్గాల్లో మరో 10 రోజుల పాటు ప్రస్తుత విధానంలోనే లాక్‌డౌన్‌అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముందని అ«ధికార వర్గాలు వెల్లడించాయి.

చదవండి: నిరుద్యోగంపై వైఎస్‌ షర్మిలకు తొలి విజయం 

మరిన్ని వార్తలు