ఈ ప్రాంతంలో వింత లాక్‌డౌన్

19 Apr, 2021 09:32 IST|Sakshi

మోర్తాడ్‌(బాల్కొండ): కరోనా వైరస్‌ ఉధృతిని అరికట్టడానికి గ్రామ పంచాయతీలు, గ్రామాభివృద్ధి కమిటీలు సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. అయితే సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ నిబంధనలు మద్యం అమ్మకాలకు వర్తించకపోవడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కిరాణ దుకాణాలు, హోటళ్లు ఉదయం కొంత సమయం, సాయంత్రం కొంత సమయంలో తెరిచి ఉంచాలని ఆయా గ్రామాల పంచాయతీలు, వీడీసీలు తీర్మానించాయి.

బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రెండు, మూడు రోజుల నుంచి సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ అమలవుతోంది. లాక్‌డౌన్‌ నిబంధనలు కిరాణ దుకాణాలు, హోటళ్లు, కూరగాయల వ్యాపారం, ఇతరత్రా చిన్న వ్యాపారులకే వర్తింప చేశారు. లైసెన్స్‌ ఉన్న మద్యం దుకాణాలు కాని, బెల్టు షాపులకు ఈ లాక్‌డౌన్‌ నిబంధనలు వర్తింప చేయడం లేదు. దీంతో సాదారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నింటిని బంద్‌ చేయాల్సి ఉండగా ఇదేమి వింత అని గ్రామస్తులు విస్తుపోతున్నారు.

( చదవండి: నిజామాబాద్‌లో దారుణం.. మున్సిపల్‌ సిబ్బందిపై దాడి! )

మరిన్ని వార్తలు