లాక్‌డౌన్‌: సరిహద్దులు దిగ్బంధం..

14 May, 2021 02:01 IST|Sakshi

గ్రామీణ రహదారులపైనా గట్టి నిఘా.. బారికేడ్లతో రాకపోకల నియంత్రణ

అత్యవసర వాహనాలకే అనుమతి.. రెండోరోజు ప్రశాంతంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/అలంపూర్‌/ కోదాడ రూరల్‌/నాగార్జునసాగర్‌: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ రెండోరోజు గురువారం ప్రశాంతంగా ముగి సింది. ఉదయం 10 గంటల తరు వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రయాణ ప్రాంగణాలలో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలకు యథావిధిగా ప్రయాణాలు సాగాయి. ఇక అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సరిహద్దుల్లోని గ్రామీణ రహదారుల గుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోకి రాకపోకలు సాగించే వాహనాలపైనా నిఘా పెట్టారు. బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాశారు. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌   సరిహద్దుల వద్ద రోడ్లపైకి వచ్చిన వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అత్యవసర పనులు, వైద్యం, వ్యవసాయ పనుల నిమిత్తం వచ్చిన వారిని మాత్రం పోలీసులు వివరాలు సేకరించి అనుమతించారు. ఏపీ నుంచి వచ్చిన అంబులెన్సులను వివరాలు సేకరించి అనుమతించారు. 


బారికేడ్లతో కట్టడి..
ఏపీ, కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలు, స్థానిక రవాణా వంటి అంశాలపై జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. అలంపూర్‌ చౌరస్తా సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద అంతర్‌ రాష్ట్ర చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. పుల్లూరు–పంచలింగాల జాతీయ రహదారిలోని రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. ఏపీ సరిహద్దు సుంకేసుల–రాజోలి వద్ద రహదారినే మూసివేశారు. కేటీదొడ్డి మండలంలోని కర్ణాటక–తెలంగాణ అంతర్‌ రాష్ట్ర రహదారిలోని నందిన్నే చెక్‌పోస్టు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను కట్టడి చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు చెక్‌పోస్టు వద్ద పరిస్థితిని ఎస్పీ భాస్కరన్‌ సమీక్షించారు.


అలంపూర్‌ వాసుల ఇక్కట్లు
లాక్‌డౌన్‌ సడలింపు సమయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొంత వ్యత్యాసం ఉండటం ఇబ్బందిగా మారింది. ఏపీలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు సడలింపు ఉండగా.. తెలంగాణలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ఉంది. ఇది ప్రతిరోజూ నిత్యావసరాలు, వైద్యం, మందులు, వ్యవసాయ అవసరాలు, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం కర్నూలు జిల్లాకు వెళ్లి వచ్చే అలంపూర్‌ నియోజకవర్గంలోని గ్రామాల ప్రజలకు సమస్యగా మారింది. ఏపీలో ఉన్న సమయానికి అనువుగా ఉద్యోగాలు, వ్యాపారాలు, సరుకుల కొనుగోళ్లు చేసి అనేక మంది సొంత గ్రామాలకు వస్తున్నారు. అప్పటికి ఇక్కడ సడలింపు సమయం ముగిసిపోతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. 
సింగరేణి వాహనాలను అనుమతించండి: డీజీపీ
లాక్‌డౌన్‌లో సింగరేణి కార్మికులు, వాహనాలను అనుమతించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి సంస్థకు అవసరమైన పేలుడు పదార్థాలు, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇతర విడిభాగాలను కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సింగరేణి సీఎండీ విజ్ఞప్తి మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా రంజాన్‌ సందర్భంగా ప్రార్థనా స్థలాల వద్ద కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు