తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమానికి పెద్దపీట 

10 Nov, 2021 01:42 IST|Sakshi

ఆరోగ్యశ్రీ, 108తో వైఎస్‌ఆర్‌కు పేరు ప్రఖ్యాతులు 

అందరికీ ఆరోగ్యం అందించేలా కృషిచేయాలి.. అందుకు ఏపీ, తెలంగాణ సీఎంలను కలుస్తా 

లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ

సాక్షి, హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ ప్రశంసించారు. ఆరో గ్యం, ఇళ్లు, వృద్ధాప్య పెన్షన్ల కోసం ఈ రెండు రాష్ట్రాలు పెద్దఎత్తున ఖర్చు చేస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉచిత డయాగ్నొస్టిక్‌ సేవలనూ కొనియాడారు. ‘ఆరోగ్యశ్రీ, 108 సేవలను ప్రవేశపెట్టడం వల్ల వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆరోగ్య, 108లు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ 85% మందికి అందుతోంది’ అని అన్నారు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ కోసం ఎక్కు వగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ప్రజలు తమ జేబుల్లో నుండి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా అందరికీ నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించేలా ఫౌండేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎఫ్‌డీఆర్‌), లోక్‌సత్తా సంయుక్తంగా రూపొందించిన ‘టువర్డ్స్‌ వయబుల్‌ యూనివర్సల్‌ హెల్త్‌కేర్‌’ను మంగళవారం జయప్రకాశ్‌ నారాయణ విడుదల చేశారు. ఈ విధాన నమూనాను ఇప్పటికే ప్రధాని సహా సంబంధిత వర్గాలందరికీ పంపామని చెప్పారు. అమలు కోసం త్వరలో ఏపీ, తెలంగాణ సీఎంలను కలుస్తానని, ఆ మేరకు వారికి లేఖ కూడా రాశానని తెలిపారు.  

ఖరీదైన ఆధునిక వైద్యం 
‘ఆధునిక వైద్యం ఖరీదుగా మారింది. ఒక పడకను యూనిట్‌గా తీసుకుంటే సూపర్‌ స్పెషాలిటీ ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఏడాదికి కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సాధారణ ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో రూ.50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కానీ గాంధీ, కాకతీయ, ఉస్మానియా వంటి ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఒక్కో పడకకు రూ.25లక్షలు ఖర్చు చేస్తుంటే, జిల్లా ఆసుపత్రుల్లో రూ.20 లక్షలే ఖర్చు చేస్తున్నారు. దీంతో ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు ఉండటంలేదు’అని జయప్రకాశ్‌ నారాయణ అన్నారు.

అమెరికాలో ప్రతీ ఐదు డాలర్లలో ఒక డాలర్‌ ఆరోగ్యం కోసం అక్కడి ప్రజ లు ఖర్చు చేస్తున్నారన్నారు. ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయం మన దేశంలో అతి తక్కువగా, జాతీయాదాయంలో 1.2% మాత్రమే ఉంటోందన్నారు. వైద్యం కోసం ఖర్చు చేయడం వల్ల ఏటా దాదాపు ఆరు కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి జారిపోతున్నారన్నారు. 

‘హుజూరాబాద్‌’ ఖర్చుపై ఆందోళన 
హుజూరాబాద్‌ ఎన్నికల ఖర్చు ప్రపంచ రికార్డని జయప్ర కాశ్‌ నారాయణ పేర్కొన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్ని కలో వివిధ పార్టీలు పెట్టిన ఖర్చుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ కంటే బ్రిటన్‌ 18–20 రెట్లు ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశమని, అక్కడ పార్లమెంట్‌ ఎన్నికల్లో 2 ప్రధాన పార్టీలు పెట్టిన ఖర్చుకంటే హుజూరాబాద్‌లో పెట్టిన ఖర్చు చాలా ఎక్కువన్నారు. ప్రస్తుత ఎన్నికల వ్యవస్థ సరైంది కాదని, దామాషా లేదా ప్రత్యక్ష ఎన్నికల పద్ధతే సరైందని అభిప్రాయపడ్డారు.    

మరిన్ని వార్తలు