203 లక్షణాలతో ‘లాంగ్‌ కోవిడ్‌’

20 Jul, 2021 19:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జాబితాలో అలర్జీ, ఆత్మహత్య ఆలోచనలు, కంటిచూపు తగ్గడం వంటి లక్షణాలు

మొత్తం 56 దేశాల్లో 4 వేల మందిపై పరిశోధన

10 అవయవ వ్యవస్థలపై ప్రభావం: లాన్సెట్‌ అధ్యయనం

మన దగ్గరా తీవ్రంగానే: పల్మనాలజిస్ట్, స్లీప్‌ స్పెషలిస్ట్‌ డా.వీవీ రమణప్రసాద్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారి మానవాళిపై ఇంకా సవాళ్లు విసురుతూనే ఉంది. కరోనా నుంచి కోలుకున్నాక సుదీర్ఘ కాలం పాటు శరీరంలోని పది అవయవ వ్యవస్థల్లో (ఆర్గాన్‌ సిస్టమ్స్‌) 203 లక్షణాలు ప్రబలంగా కనిపిస్తున్నట్లు లాన్సెట్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పటివరకు అంతగా బయటపడని కొత్త అలర్జీలు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు, కంటిచూపు మందగించడం, వినికిడి శక్తి బలహీన పడటం, ముఖ పక్షవాతం వంటి కొత్త సమస్యలు వెలుగులోకి వచ్చాయి. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తల ఆధర్యంలో మొత్తం 56 దేశాల్లో లాంగ్‌ కోవిడ్‌తో బాధపడుతున్న దాదాపు 4 వేల మందిపై ఈ పరిశోధన జరిపారు. భవిష్యత్‌లో వచ్చే కరోనా వేవ్‌లను ఎదుర్కోవడంతో పాటు వైద్య వ్యవస్థపై కోవిడ్‌–19కు సంబంధించిన ప్రభావాలు, పరిణామాలను అంచనా వేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. 


35 వారాలకు పైగానే.. 

కరోనా నుంచి బయటపడ్డాక పూర్తిగా కోలుకునేందుకు 91 శాతం పైగా మందికి 35 వారాలకు పైగా పడుతున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. మొత్తం 4 వేల మందిలో రెండున్నర వేల మంది 6 నెలల దాకా కోవిడ్‌కు సంబంధించిన కొన్ని లక్షణాలతో బాధపడినట్లు తేల్చింది. కోవిడ్‌ తగ్గాక 4 వారాలు అంతకుమించి ఎక్కువ కాలానికి అనారోగ్య సమస్యలు, కరోనా లక్షణాలున్న వారిని ‘లాంగ్‌ కోవిడ్‌’తో బాధపడుతున్న వారిగా యూఎస్‌ ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ పేర్కొన్న విషయం తెలిసిందే.

లాంగ్‌ కోవిడ్‌ లక్షణాల్లో అలర్జీలు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు, కంటిచూపు మందగించడం, వినికిడి శక్తి బలహీనపడటం, ముఖ పక్షవాతం, ‘సీజర్స్‌’, ‘అనాఫైలాక్సిస్‌’ వంటి కొత్త లక్షణాలు బయటపడ్డాయి. సాధారణంగా ఎక్కువమంది నీరసం, అలసట, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, తగ్గిపోవడం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు, జలుబు, తలనొప్పి, మహిళల రుతుక్రమంలో మార్పులు, వివిధ శారీరక బలహీనతలు, లైంగికపరమైన సమస్యలు, రుచి, వాసన కోల్పోవడం తదితర లక్షణాలతో బాధపడుతున్నారని స్పష్టం చేసింది. 


మన దగ్గరా ఎక్కువగానే.. 

మన దగ్గర ప్రధానంగా ఉపిరితిత్తులు, మానసిక, గుండె, నరాల సంబంధిత, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, మెట్లు ఎక్కేటప్పుడు, బరువులు ఎత్తేటప్పుడు ఆయాసం వంటి లాంగ్‌ కోవిడ్‌ సమస్యలను ఎదుర్కొంటున్నారు. గతంలో అస్తమా, అలర్జీ ఇతర సమస్యలు లేనివారిలోనూ కోవిడ్‌ కారణంగా కొత్తగా అలర్జిక్‌ బ్రాంకైటిస్‌ లక్షణాలు కన్పిస్తున్నాయి. ఆయాసం, పిల్లి కూతలు, ఛాతీపై బరువు, దగ్గు, వంటి లక్షణాలు దీర్ఘకాలం ఉంటున్నాయి. నోటితో గాలి తీసుకోవాల్సి రావడం, చేతులు, కాళ్లు కొంకర్లు పోవడం, బుగ్గలు, పెదాలపై తిమ్మిర్లు రావడం, గుండె దడ, కలత నిద్ర, నిద్రలేమి, దురదలు వంటి సమస్యలతో మా వద్దకు వస్తున్నారు.     
– డా.వీవీ రమణప్రసాద్, పల్మనాలజిస్ట్, స్లీప్‌ డిజార్డర్స్‌ స్పెషలిస్ట్, కిమ్స్‌ ఆస్పత్రి

మరిన్ని వార్తలు