నిరాడంబరంగా నిమజ్జనం

2 Sep, 2020 01:14 IST|Sakshi

కరోనా వైరస్‌తో తగ్గిన భక్తజన కోలాహలం 

లడ్డూ వేలం లేని బాలాపూర్‌ గణేశుడు  

4 గంటల్లో ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం పూర్తి 

సాక్షి, హైదరాబాద్‌: గణపతులు కొలువుదీరిన వాహనాలతో కిక్కిరిసిపోయిన రోడ్లు, గంటల కొద్దీ శోభాయాత్రలు, భక్తుల నృత్యాలు, జయజయ ధ్వనులు, ప్రసాదాల వితరణ, చిన్నారుల చిందు లు, యువతీయువకుల కోలాహలం.. ఏటా వినాయకుల నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై కనిపించే దృశ్యాలు. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావం, ప్రభుత్వ నిబంధనలతో ఈ ఏడాది ఇలాంటి దృశ్యాలు చాలా వరకు కనిపించలేదు. అతి తక్కువ మందితో వచ్చి వినాయకుల నిమజ్జనం పూర్తి చేసుకుని వెళ్లిపోయారు.  

‘ఓ ధన్వంతరీ వినాయకా.. మానవ జాతి మేలు కోసం మహా వినాయకుడిగా మళ్లీ రావాలే.. కోవిడ్‌ను ఓడించి విజయ వినాయకుడివై పూజలందుకోవాలి’అని భక్తుల ప్రార్థనలు, నినాదాల మధ్య హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన శోభాయాత్ర మంగళవారం నిరాడంబరంగా ముగిసింది. కోవిడ్‌ నిబంధనల నేపథ్యం లో వినాయక విగ్రహాలతో పాటు శోభా యాత్రలో పాల్గొన్న భక్తుల సంఖ్య కూడా ఈసారి భారీగా తగ్గిపోయింది. అర్ధరాత్రి వరకు హుస్సేన్‌సాగర్‌లో దాదాపు మూడున్నర వేల విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఇక కూకట్‌పల్లి ఐడీఎల్, హస్మత్‌పేట, సరూర్‌నగర్, సఫిల్‌గూడ, దుర్గం చెరువు, మల్కం చెరువు తదితర ప్రాంతాల్లో మొత్తం పది వేల వరకు విగ్రహాలను గంగమ్మ చెంతకు చేర్చారు.  

4 గంటల్లో ఖైరతాబాద్‌ గణపతి నిమజ్జనం పూర్తి  
ప్రసిద్ధ ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం నాలుగు గంటల్లో పూర్తి చేశారు. 11 రోజుల పాటు విశేష పూజలందుకున్న ‘శ్రీధన్వంతరి నారాయణ’గా కొలువుదీరిన ఖైరతాబాద్‌ మహా గణపతి మంగళవారం భక్తుల కోలాహలం, జయజయ ధ్వనుల మధ్య గంగమ్మ ఒడికి చేరాడు. మధ్యాహ్నం 12.44 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర సెన్సేషన్‌ థియేటర్, రాజ్‌దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్, ఎక్బాల్‌ మినార్‌ చౌరస్తా, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా 4.35 గంటలకు ట్యాంక్‌బండ్‌లోని క్రేన్‌ నంబర్‌ 3 వద్దకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 5.26 గంటలకు మహా గణపతి నిమజ్జనం పూర్తి చేశారు. అయి తే గతంతో పోలిస్తే ఈసారి నెక్లెస్‌రోడ్‌లో భక్తజన సందోహం భారీగా తగ్గింది.  

కేసీఆర్‌కు బాలాపూర్‌ లడ్డూ
ఈసారి లడ్డూ వేలం లేకుండానే బాలాపూర్‌ గణేశుడు గంగమ్మ ఒడిలో చేరిపోయాడు. ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. చంద్రాయణగుట్ట, ఫలక్‌ నుమా, చార్మినార్, మొజంజాహీ మార్కెట్‌ మీదుగా ఉదయం 11.30 గంటలకు హుస్సేన్‌సాగర్‌ చేరుకున్నాడు. అనంతరం పూజలు నిర్వహించి నిమజ్జనం పూర్తి చేశారు. ఈ ఏడాది లడ్డూ వేలం వేయలేదని, సీఎం కేసీఆర్‌కు లడ్డూని బహూకరిస్తామని బాలాపూర్‌ గణపతి నిర్వాహక కమిటీ ప్రకటించింది. 

ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం 
వినాయక శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా జరగటంతో పోలీసు, అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. పోలీస్‌ కమిషనర్లు అంజనీ కుమార్, మహేశ్‌ భగవత్, వీసీ సజ్జనార్‌లు ప్రత్యక్షంగా బందోబస్తులో పాల్గొన్నారు. మున్సిపల్‌ సిబ్బంది రహదారులతో పాటు చెరువుల్లోని వ్యర్థాలను వెనువెంటనే శుద్ధి చేశారు.

మంగళవారం హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తున్న ఖైరతాబాద్‌ మహాగణపతి 

మరిన్ని వార్తలు