ఎర్ర బంగారం మింగేసింది మూడు నెలల్లో 17 మంది..

1 Mar, 2022 01:34 IST|Sakshi

మానుకోటలో మరణ మృదంగం 

కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు 

సాక్షి, మహబూబాబాద్‌: మిర్చిని నమ్ముకున్న రైతుకు చివరికి అప్పులే మిగిలాయి. ఏటేటా అప్పు మీద అప్పు కుప్పలై ప్రాణాలకు ముప్పు తెచ్చింది. పంట చేతికొచ్చిందని ఆనందపడేలోపే తెగులు సోకి మూడు నెలల్లో 17 మంది రైతులు ‘చితి’కి పోయారు. గిరిజన రైతులు ఎక్కువగా ఉండే మహబూబాబాద్‌ జిల్లాలో ఐదు ఎకరాలలోపు భూములు ఉండేవారు ఎక్కువగా ఉంటారు.

ఇతర పంటలుసాగు చేస్తే పెద్దగా లాభాలు రావడంలేదు. గత ఏడాది మీర్‌ మిర్చి క్వింటాకు రూ.18 వేల మేరకు పలికింది. దీంతో లాభాలు వస్తాయని ఆశించి అటు వైపు మళ్లారు. గతేడాది జిల్లాలో 18 వేల ఎకరాలు మిర్చిపంట సాగు చేసిన రైతులు ఈ ఏడాది 81 వేల ఎకరాల్లో సాగు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తామర పురుగు ఈ ఏడాది ఎక్కడి నుంచి దాపురించిందో.. ఏమో కానీ, రైతును నిండాముంచింది.

మొదట నకిలీ విత్తనాలు కొని 2 వేల ఎకరాల మేర రైతులు నష్టపోయారు. తీరా పూత, కాత దశకు రాగానే తామర పురుగు దాపురించి పంటను తినేసింది. దీంతో ఆశతో సాగుచేసిన పంట చేతికి రాకపోగా పెట్టుబడి కూడా రాక అప్పులు మిగిలాయి. ఈ ఏడాది మిర్చికి క్వింటాలు రూ.20 వేలు పలుకుతోంది. 

అప్పు మీద అప్పు.. ప్రాణాలకొచ్చె ముప్పు... 
‘మహబూబాబాద్‌ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన నారమళ్ల సంపత్‌(25) తన మూడెకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి సాగుచేశాడు. ఈ ఏడాది రూ.5 లక్షలు పెట్టుబడి అయింది. గతంలో ఉన్న రూ.3 లక్షలు కలిపి మొత్తం రూ.8 లక్షల అప్పు అయింది. మిర్చి పంట చేతికి రాగానే అప్పులు తీర్చవచ్చని ఆశపడ్డాడు. తామర తెగులు సోకి మిరప తోటంతా పాడైంది. దీంతో మనస్తాపం చెందిన సంపత్‌ మిరప తోటలోనే కలుపుమందు తాగి గత డిసెంబర్‌ 30న ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి నెలరోజులు కూడా నిండని పసిపాపతోపాటు, మూడేళ్ల కూతురు సాన్వి, భార్య వెన్నెల ఉన్నారు. 

బిడ్డల పెళ్లిళ్ల అప్పులకు తోడు..
‘మహబూబాబాద్‌ మండలం లక్ష్మాతండాకు చెందిన అజ్మీరా శ్రీను(39)కు నాలుగు ఎకరాల భూమి ఉంది. ఎకరంలో వరి, మూడెకరాల్లో మిర్చి సాగుచేశాడు. ఇద్దరు బిడ్డల పెండ్లి కోసం రూ.5 లక్షలు అప్పు చేయగా.. ఈసారి మిర్చిపై వచ్చే డబ్బుతో అప్పులు తీర్చవచ్చని ఆశపడ్డాడు. పంటకోసం రూ. 5 లక్షలు అప్పు చేశాడు. మిరపతోపాటు వరి కూడా ఆశించిన స్థాయిలో పండలేదు. గతంలో చేసిన అప్పులకు ఈ ఏడాది అప్పులు తోడయ్యాయి. ఎలా తీర్చాలనే బెంగతో మిరప తోటకు కొట్టే పురుగుల మందు తాగి గత డిసెంబర్‌ 31న ఆత్మహత్య చేసుకున్నారు. 

భూమి అమ్ముకుని.. 
కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన వల్లంల వెంకన్న (45) తనకున్న ఎకరం భూమితోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. అప్పటికే పంటసాగులో దిగుబడులు రాక, పెట్టుబడులు తీసుకువచ్చిన అప్పులు అలాగే ఉండటంతో కొంతభూమిని అమ్ముకున్నాడు. ఉన్న ఎకరం భూమితోపాటు, కౌలు భూమిలో పలు పంటలు సాగుచేశాడు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెందిన అతడు ఈ ఏడాది జనవరి 5న పురుగుల మందుతాగి మృతి చెందాడు. వెంకన్నకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు.  

చేతికొచ్చిన కొడుకులతో సాగు చేసినా చేతికిరాని పంట 
కేసముద్రం మండలం అర్పనపల్లి శివారు కిష్టాపురం తండాకు చెందిన గుగులోతు ఈర్యా(58) 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. మూడెకరాల్లో మిర్చి, 7 ఎకరాల్లో వరి వేశాడు. ఈర్యా తన ఇద్దరు కుమారులు రవి, రమేశ్‌తో కలసి వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో మిర్చి పంటకు తామర తెగులు సోకడం తో పంట దెబ్బతిన్నది. అప్పు చేసి పురుగుల మందు లు కొట్టినా ఫలితం లేకుండా పోయింది. పెట్టుబడికి తీసుకువచ్చిన రూ.1.50 లక్షల అప్పు భారంగా మారింది. చెల్లించలేని పరిస్థితిలో ఈర్యా ఫిబ్రవరి 24న పురుగులమందు తాగి చని పోయాడు. అతడికి భార్య బద్రి, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

మహబూబాబాద్‌ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతులు.. 
నారమల్ల సంపత్, అజ్మీరా శ్రీను, భూక్య బాలు, గుగులోతు ఈర్యా, బోడ భాస్కర్, అంగోత్‌ బిక్కు, గుగులోతు రామోజీ, ధరావత్‌ వెంకన్న, బానోత్‌ లకుపతి, దరంసోత్‌ చందు, లునావత్‌ లక్ష్మణ్, తోట వెంకన్న, వల్లంల వెంకన్న, బానోత్‌ లాలసింగ్, రమావత్‌ శ్రీను, భూక్య వెంకన్న, బోడ సిరి.   

మరిన్ని వార్తలు