నిమ్జ్‌ నిర్వాసితులపై లాఠీ

23 Jun, 2022 01:04 IST|Sakshi

పరిహారం కోసం ఆందోళనకు దిగిన రైతులు, రైతు కూలీలు 

మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా నిరసన 

పోలీసులతో వాగ్వాదం, తోపులాట నేపథ్యంలో లాఠీచార్జి 

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/ఝరాసంగం: తమ భూములకు పరిహారం చెల్లించే వరకు, రైతు కూలీలకు న్యాయం చేసేవరకు నిమ్జ్‌ (జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలి)లో నిర్మాణాలు చేపట్టవద్దంటూ నిర్వాసితులు బుధవారం చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం మామిడిగిలో నిర్వహించిన ర్యాలీని మంగళవారం రాత్రి నుంచే మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో జరిగిన వాగ్వాదం తోపులాటకు దారితీయడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇదే గ్రామానికి చెందిన పద్మమ్మ అనే మహిళ ముఖానికి గాయం కావడంతో స్పృహ కోల్పోయింది. దీంతో పోలీసులు ఆమెను జహీరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పదుల సంఖ్యలో నిర్వాసితులను అదుపులోకి తీసుకొని చిరాగ్‌పల్లి పీఎస్‌కు తరలించారు. లాఠీచార్జిపై మండిపడ్డ కొందరు ఆందోళనకారులు పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు.

నిమ్జ్‌ గోబ్యాక్‌ .. సేవ్‌ ఫార్మర్‌ 
ఝరాసంఘం మండలం చీలపల్లి వద్ద నిమ్జ్‌లో వెమ్‌ టెక్నాలజీస్‌కు ప్రభుత్వం 512 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ స్థలంలో సమీకృత రక్షణ వ్యవస్థ పరిశ్రమ నిర్మాణానికి సంస్థ భూమి పూజ నిర్వహించింది. ఈ నేపథ్యంలో నిర్వాసితులు ‘గోబ్యాక్‌ నిమ్జ్‌.. సేవ్‌ ఫార్మర్, జై జవాన్‌.. జై కిసాన్, సారవంతమైన భూములు లాక్కోవద్దు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

2013 చట్టం ప్రకారం పరిహారమివ్వాలి
నిమ్జ్‌ కోసం సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల పరిధిలో మొత్తం 12,635 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో 3,100 ఎకరాలను సేకరించింది. అయితే ప్రభుత్వం నామమాత్రంగా పరిహారం చెల్లించిందని.. తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు