మయన్మార్‌ అమ్మాయి.. ఆదిలాబాద్ అబ్బాయి

7 Feb, 2023 11:46 IST|Sakshi

ఆదిలాబాద్: అతడేమో గుడిహత్నూర్‌ మండలం చింతగూడకు చెందిన గొల్లపల్లి రవి.. ఆమెనేమో మయన్మార్‌ దేశంలోని ఇన్సైన్‌ పట్టణానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన జిన్‌ న్వే థీయోన్‌. వీరిద్దరు ఉపాధి నిమిత్తం ఖతర్‌ దేశానికి వెళ్లి అక్కడ హోటళ్లో పనిచేస్తుండగా ఇద్దరు మనస్సులు కలిశాయి. ఇరు కుటుంబాలను సంప్రదిస్తే వారు వివాహానికి సమ్మతించారు. ఇంకేముందు సీన్‌ కట్‌ చేస్తే.. సోమవారం రవి స్వగ్రామం చింతగూడలో వారిద్దరికి సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. 

అయితే ఈ జంటను చూస్తున్నవారికి ముచ్చట గొలిపింది. ప్రేమకు భాష, దేశ హద్దులు అడ్డురావని నిరూపించారు ఈ ప్రేమికులు. మండలంలోని చింతగూడెం గ్రామానికి చెందిన గొల్లపల్లి రవి ఆరేళ్ల  క్రితం ఉపాధి కోసం ఖతర్‌ దేశం వెళ్లాడు. అక్కడ దోహా పట్టణంలోని హోటల్లో పని చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో అదే హోటల్లో పనిచేస్తున్న మయన్మార్‌ దేశంలోని ఇన్సైన్‌ పట్టణానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన జిన్‌ న్వే థీయోన్‌తో పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డారు. ఇద్దరి మనసులు ఒకటయ్యాయి. వీరి ప్రేమ వ్యవహారంను ఇరు కుటుంబాలకు తెలిపారు.

 వీరి ప్రేమను అర్థం చేసుకొని వారు స్వాగతించారు. రవి స్వగ్రామమైన చింతగూడెంలో క్రైస్తవ సంప్రదాయబద్ధంగా పెళ్లికి నిశ్చయించారు. ఈ క్రమంలో సోమవారం గ్రామంలోని చర్చిలో పెళ్లి చేసుకొని ఈ జంట ఒక్కటయ్యారు. వరుడు తరఫున బంధుమిత్రులు హాజరుకాగా, వధువు తరఫున ఆమె సోదరుడు క్వేక్వే థీయన్‌ హాజరై ఇక్కడి పెళ్లి తంతు సంప్రదాయాలను తన మొబైల్‌ ద్వారా మయన్మార్‌ లోని తన కుటుంబ సభ్యులకు చేరవేశాడు. వరుడు రవి కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంతో వధువును తమ కుటుంబంలోకి స్వాగతించారు.

మరిన్ని వార్తలు