ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్‌లో ఆత్మహత్య

31 Mar, 2021 14:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో పరిచయం కాస్త ప్రేమగా మారింది.. పెళ్లి చేసుకున్నారు. అనంతరం కలిసి ఉందామంటే అతడు నిరాకరించడంతో ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో చోటుచేసుకుంది. యువతి తాను ఉంటున్న వసతిగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో దుగ్యాల ఐశ్వర్య (20) నివసిస్తుండేది. ఆమె బంజారాహిల్స్‌లోని ఓ ప్రయివేట్ సంస్థలో బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తుండేది.

అయితే కొంతకాలం కిందట మారెడ్డి ఆశిర్ అనే యువకుడితో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ఆ పరిచయం వారి మధ్య ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయానికి వచ్చారు. దీంతో ఆశిర్ గతేడాది ఫిబ్రవరి 20వ తేదీన ఐశ్వర్యను హైదరాబాద్‌ శివారులోని సంఘీ దేవాలయంలో వివాహం చేసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులు కలిసి ఉన్నారు. అయితే ఈ పెళ్లి విషయం ఇంట్లో తెలియడంతో ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఏ పనీ చేయని ఆశిర్ రెడ్డి నిన్ను పోషించలేడు అని ఐశ్వర్యను ఆమె కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువెళ్లారు.

తన భర్తను దూరం చేశారని ఐశ్యర్య అప్పటినుంచి తల్లిదండ్రుల మీద కోపం పెంచుకుంది. దీంతో హైదరాబాద్‌కు వచ్చి వసతిగృహంలో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. అయితే తాను కుటుంబసభ్యులను ఒప్పిస్తానని నమ్మ బలికిన ఆశిర్ ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐశ్వర్య గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆశిర్‌కు చెప్పి కలిసి ఉందామని విషయాన్ని ప్రస్తావించింది. ఈ విషయం ఆశిర్‌ దాటవేస్తూ వస్తున్నాడు. ఆమె ఒత్తిడి చేస్తుండడంతో ‘నాకు కొంత సమయం కావాలి’ అని ఆశిర్‌ కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఈక్రమంలోనే ఆమెకు గర్భం తీసి వేయించాడు (అబార్షన్‌). ఆశిర్‌తో ఎలాగైనా తేల్చుకోవాలని ఐశ్వర్య వారి ఇంటికి వెళ్లింది. 

అక్కడ ఆ కుటుంబసభ్యులు ఐశ్వర్యను దారుణంగా అవమానించారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. కొన్ని రోజులుగా బంజారాహిల్స్  రోడ్ నంబర్- 3లోని ఓ పేయింగ్ గెస్ట్ హౌస్‌లో నివసిస్తోంది. ఆ మనస్తాపంతోనే మంగళవారం తెల్లవారుజామున ఐశ్వర్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు కొన్ని సెల్ఫీ వీడియోలను ఐశ్వర్య తీసుకుంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే ప్రియుడు ఆశిర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: విద్యార్థిని చితక్కొట్టిన వాచ్‌మెన్‌

చదవండి: ముగ్గురి గ్యాంగ్‌ రూ.3 కోట్ల మోసం

మరిన్ని వార్తలు