Lovers Kidnap: ప్రేమికుల కిడ్నాప్‌.. అడవుల్లో తిప్పుతూ చిత్రహింసలు!

7 Aug, 2021 09:10 IST|Sakshi
కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

 సుల్తాన్‌బజార్‌లో ప్రేమికుల కిడ్నాప్‌

పెళ్లికోసం వచ్చిన జంటపై దాడి

అడవుల్లో తిప్పుతూ చిత్రహింసలు

ఆరుగురు కిడ్నాపర్ల అరెస్ట్‌

సాక్షి, సుల్తాన్‌బజార్‌: ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకుందామని నగరానికి వచ్చిన ప్రేమజంటను అమ్మాయి తరపు బంధువులు కిడ్నాప్‌ చేసి ఇష్టానుసారంగా దాడి చేశారు. సుల్తాన్‌నగర్‌ పోలీసులు తెలిపిన మేరకు.. నారాయణపేట్‌జిల్లా బండగొండ గ్రామానికి చెందిన శివశంకర్‌గౌడ్‌(23), అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అడ్డుచెప్పారు. దీంతో నగరంలోని ఆర్యసమాజ్‌లో వివా­హం చేసుకుందామని నిర్ణయించుకున్నారు.పెళ్లి చేసుకోవాలని భావించి ముందుగానే (ఈనెల 3)న నగరానికి వచ్చారు. గురువారం శివశంకర్, అతను ప్రేమించిన యువతి కాచిగూడ క్రాస్‌లో ఉన్న ఓ మాల్‌ సెల్లార్‌లో ఉండగా అమ్మాయి తరపు బంధువులు ఇద్దరిపై దాడిచేసి కారులోకి తీసుకెళ్లారు. 

సినీఫక్కీలో కిడ్నాప్‌.. చిత్రహింసలు
సినిమాలో చూపించినట్లు ప్రేమికులను వారు కారులో ఇష్టానుసారం చితకబాదారు. సుల్తాన్‌బజార్‌ పోలీసుస్టేషన్‌ ముందు నుంచి  వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ  తీవ్ర చిత్రహింసలకు గురిచేసారు.ఈ దాడిలో శివశంకర్‌కు తీవ్ర రక్తగాయాలయ్యాయి.  సంగనూరుపల్లిలో శివశంకర్‌కు దుస్తులు మార్పించారు. ఆ తరువాత మద్దూరు పోలీసుస్టేషన్‌లో శివశంకర్‌ను అప్పగించి వారి అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్లారు. 

సీసీ ఫుటేజి ఆధారంగా నిందితుల అరెస్ట్‌...
యువతి స్నేహితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బడీచౌడి ఆర్యసమాజ్, కాచిగూడ బిగ్‌బజార్‌ వద్ద సీసీ ఫుటేజిని పరిశీలించారు. కారు నెంబర్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కారు ఓనర్‌ ద్వారా వివరాలు సేకరించిన పోలీసులు మద్దూర్‌ పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో అక్కడి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని సుల్తాన్‌బజార్‌ పోలీసులకు అప్పగించారు. శుక్రవారం తెల్లవారు జామున ఆరుగురు కిడ్నాపర్లు కోట్టం కష్ణారెడ్డి(43), కోట్టం శ్రీనివాస్‌రెడ్డి(23), జి.తిరుపతి(23), కె.శ్యాంరావురెడ్డి(27), కె.పవన్‌కుమార్‌రెడ్డి(21), పి.హరినాథ్‌రెడ్డి(29)లను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు.

చదవండి: పెళ్లి చేసుకుందాం అన్నందుకు చున్నీని గొంతుకు బిగించి..

మరిన్ని వార్తలు