Hyderabad: బస్సు.. గుస్సా! ప్రజా రవాణాపై నీలినీడలు 

17 Apr, 2022 14:39 IST|Sakshi

నగర జనాభా కోటిన్నర 

6 వేల బస్సులు అవసరం 

ఉన్నవి 2,500 మాత్రమే 

ఔటర్‌ దాటి సిటీ విస్తరణ  

అయినా అరకొర సర్వీసులే

సాక్షి, హైదరాబాద్‌: ‘మీ ప్రాంతానికి రావాల్సిన బస్సు జీవిత కాలం లేటు’ అన్నచందంగా మారింది నగరంలో ఆర్టీసీ సర్వీసుల పరిస్థితి. పది వేల జనాభా ఉన్న సింగపూర్‌ టౌన్‌షిప్‌నకు రెండేళ్లుగా సిటీ బస్సులు నిలిచిపోయాయి. తెల్లారి లేస్తే అంతా ఉద్యోగాలకు వెళ్లేవారే. రెండేళ్లుగా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

మహిళలు, పిల్లలు, ఈ  టౌన్‌షిప్‌నకు వచ్చే బంధుమిత్రులు అవస్థల పాలవుతున్నారు. తాజాగా ఈ రూట్‌లో బస్సుల పునరుద్ధరణకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కానీ ప్రయాణికుల డిమాండ్‌ మేరకు  బస్సులు నడుస్తాయా లేదా అనేది సందేహమే.

ఒక్క సింగపూర్‌ టౌన్‌షిప్‌ మాత్రమే కాదు. గ్రేటర్‌లోని అనేక ప్రాంతాల్లో ప్రయాణికుల అవసరాలకు సరిపడా బస్సులు లేవు. 10 ట్రిప్పులు నడపాల్సిన రూట్‌లలో కేవలం 3 లేదా 4 ట్రిప్పులు తిరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ వాహనాల వైపు వెళ్లాల్సివస్తోంది.  

పదేళ్లుగా కొత్తవి పత్తా లేదు..  
 హైదరాబాద్‌ మహానగర జనాభా సుమారు కోటిన్నరకు చేరువైంది. ఔటర్‌ను దాటి నగరం విస్తరిస్తోంది. ఏటా వందలాది కొత్త కాలనీలు, అపార్ట్‌మెంట్‌లు, విల్లాలు  వెలుస్తున్నాయి. ప్రజా రవాణా నిపుణుల అంచనాల ప్రకారం  2015 నాటికే  కనీసం  6వేల  బస్సులు అవసరం. 2013  నుంచి ఇప్పటి వరకు కేవలం 80 ఏసీ బస్సులు మాత్రమే కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. 
► అదే సమయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు సిటీ బస్సుల సంఖ్య సగానికి తగ్గింది. గతంలో  3850  బస్సులు ఉంటే  ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 2500కు పరిమితమైంది. మూడేళ్ల  క్రితం 850  సిటీ బస్సులను కార్గో వాహనాలుగా మార్చారు. మరి కొన్నింటికి  కాలం చెల్లింది. బస్సుల సంఖ్య తగ్గింది. ఇప్పుడు ఉన్న వాటిలోనూ కొన్ని డొక్కు బస్సులే. కానీ కొత్త వాటిని కొనుగోలు చేసే అవకాశం లేకపోవడంతో  ఉన్నవాటితోనే అధికారులు నెట్టుకొస్తున్నారు.  

గణనీయంగా తగ్గిన ట్రిప్పులు 
►  గత పదేళ్లలో ఆర్టీసీ లెక్కలు పూర్తిగా తారుమారయ్యాయి. పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు అన్ని రూట్లలో ట్రిప్పుల సంఖ్య పెరగాల్సి ఉండగా భారీగా తగ్గిపోయింది. మూడేళ్ల  క్రితం వరకు  రోజుకు 42 వేల ట్రిప్పులు తిరిగాయి. అంటే సుమారు 9 లక్షల కిలోమీటర్ల పైచిలుకు  నడిచాయి.  
►  నిజానికి పెరుగుతున్న జనాభాకు  ఈ  సదుపాయం  తక్కువే. 2015 నాటికే కనీసం 60 వేల  ట్రిప్పులకు పెరగవలసి ఉండగా అందుకు భిన్నంగా కనీసం  10 వేల ట్రిప్పులు తగ్గాయి. ‘ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లు, ఇతర వాహనాల్లో వెళ్తుంటే బాధగా అనిపిస్తుంది. మా బస్సెక్కాల్సిన వాళ్లు  ఇతర వాహనాల్లో వెళ్లడం బాధగానే ఉంటుంది. కానీ  బస్సులే తగినన్ని లేనప్పుడు ఏం చేయగలం’అని ఓ డిపో మేనేజర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  
►  ఇప్పటికిప్పుడు కనీసం వెయ్యి కొత్త బస్సులు వచ్చినా కొంతమేరకు ప్రయాణికులకు ఊరట లభించనుంది. ‘కొత్త బస్సులు కొనుగోలు చేయకపోతే ఆర్టీసీ మనుగడ మరింత ప్రశ్నార్థకమవుతుంది’ అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. 

పెరిగిన వ్యక్తిగత వాహనాలు..  
కోవిడ్‌ కంటే  ముందే  సిటీ బస్సు కుదేలైంది. కోవిడ్‌తో  పూర్తిగా నష్టపోయింది. పెరిగిన డీజిల్‌  ధరలు మరింత దారుణంగా దెబ్బతీశాయి. రోజుకు  రూ.3.5 కోట్ల ఆదాయం వస్తే ఖర్చు రూ.4.5 కోట్లు దాటుతోంది. రోజుకు కనీసం రూ.కోటి నష్టం. ఈ నష్టాలను అధిగమించేందుకు ఆర్టీసీ  అధికారులు తాత్కాలిక ఉపశమన చర్యలు చేపడుతున్నారే తప్ప బస్సుల సంఖ్య పెంచడంలేదు.  

‘మెట్రో’ తారకమంత్రం కాదు..  
మెట్రో రైలు ప్రజా రవాణాకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాబోదు. అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు  సిటీ బస్సు ఒక్కటే  పరిష్కారమని సిటిజనులు చెబుతున్నారు. 

రోజుకు రెండు ట్రిప్పులే 
జూబ్లీబస్‌స్టేషన్‌ నుంచి ఉద్దమర్రికి గతంలో రోజుకు 6 ట్రిప్పులు ఉండేవి. ఇప్పుడు కేవలం 2 ట్రిప్పులు మాత్రమే వస్తున్నాయి. విద్యార్థులు  బాగా ఇబ్బంది పడాల్సి వస్తోంది.      – సత్తిరెడ్డి, ఉద్దమర్రి 

ఎట్టకేలకు స్పందించారు     
సింగపూర్‌ టౌన్‌షిప్‌నకు రెండేళ్ల క్రితం కోవిడ్‌ కారణంగా బస్సులను నిలిపివేశారు. దీంతో  తీవ్ర ఇబ్బందులకు గురయ్యాం. అధికారుల చుట్టూ తిరిగాం. చివరకు  ఇప్పుడు వేశారు. – వెంకట్‌ మాధవ రెడ్డి, సింగపూర్‌ టౌన్‌షిప్‌

మరిన్ని వార్తలు