వంట గ్యాస్‌: అదనంగా రూ. 6 కోట్లు!

6 Jan, 2021 08:22 IST|Sakshi

రీఫిల్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు 

గ్రేటర్‌లో ప్రతినెల రూ .6 కోట్లకు పైగా వసూలు

వినియోగదారుల జేబులకు చిల్లులు

ఫిర్యాదు చేసినా పట్టించుకోని డిస్ట్రిబ్యూటర్లు

అదనపు చెల్లింపు అవసరం లేదంటున్న ఆయిల్‌  కంపెనీలు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎల్పీజీ వంట గ్యాస్‌ సిలిండర్‌పై డెలివరీ బాయ్స్‌ ప్రతినెలా అదనంగా ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా.? అక్షరాల రూ.6 కోట్ల పైమాటే. ఆశ్చర్యపోతున్నారా..? ఇది నిజం. ప్రతి వినియోగదారుడు సిలిండర్‌ రిఫిల్‌పై డెలివరీ బాయ్స్‌కు బిల్లుపై అదనంగా రూ.20 నుంచి రూ.30 చెల్లిస్తున్నారు. చిల్లరే కదా అనుకుని తేలిగ్గా తీసుకోవడంతో అది కాస్తా ‘తప్పనిసరి‘గా మారింది. 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలో గ్యాస్‌ బండ( సిలిండర్‌) వినియోగదారులకు నానాటికి భారంగా మారుతోంది. ఓ వైపు ఆరు నెలలకోసారి ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్ల ధరను పెంచుతుండగా, మరో వైపు డెలివరీ బాయ్స్‌ డిమాండ్‌ చేసి మరీ అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఎల్పీజీ రీఫిల్‌ బుక్‌ చేసి ఆన్‌లైన్‌లో నిర్ణీత ధర చెల్లించినా డెలివరీ సమయంలో అదనపు బాదుడు తప్పడం లేదు. ఇక నగదు చెల్లింపు అయితే బిల్లుతో కలిపి అదనంగా రూ. 30 వరకు వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది.

ఈ అదనపు వసూళ్లు డెలివరీ  బాయ్స్‌కు  కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ప్రధాన ఆయిల్‌ కంపెనీలు  ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసం లేదని స్పష్టం చేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ప్రస్తుతం ఇంటికి సిలిండర్‌ డెలివరీ చేస్తే నిర్ణీత ధర రూ.746.50పైసలు అయినా నగదు రూ.770  చెల్లించాల్సిందే. అదే చేతిలో చిల్లల లేకుంటే మరో పది రూపాయిలు కూడా పెరగొచ్చు. డెలివరీ బాయ్స్‌  వినియోగదారుడి చేతికి బిల్లు ఇచ్చి అదనపు మోత కలిపి  వసూలు చేయడం పరిపాటిగా తయారైంది. 

ఏజెన్సీల నిర్లక్ష్యం.. 
ఏజెన్సీలు వినియోగదారులకు రీఫిల్‌ డోర్‌ డెలివరీ బాధ్యతలో నిర్లక్ష్యం వహించడం విస్మయానికి గురి చేస్తోంది. ఫలితంగా చమురు సంస్థలు నిర్దేశించిన ధర అమలు కావడం లేదు. గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్లు రీఫిల్‌ ధర, గ్యాస్, డోర్‌ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ)లతో కలుపుకొని బిల్లింగ్‌ చేసి  వినియోగదారులకు  సరఫరా చేయాల్సి ఉంటుంది. చమురు సంస్థల నిర్దేశించిన ధరనే బిల్లింగ్‌ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు వినియోగదారులకు  సిలిండర్‌ సరఫరా బాధ్యతను డెలివరీ బాయ్స్‌కు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. అదనపు వసూళ్లపై డిస్ట్రిబ్యూటర్లకు ఫిర్యాదుచేసినా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. 

చాలీచాలని వేతనాలు..  
సిలిండర్‌ డెలివరీ బాయ్స్‌కు చాలీచాలని వేతనాల చెల్లిస్తుండటం కూడా వినియోగదారులపై అదనపు బాదుడుకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా  డెలివరీ బాయ్స్‌కు ఏజెన్సీలు కనీస వేతనాలు అమలు చేయడం లేదు. కొందరు డిస్ట్రిబ్యూటర్లు వారికి  నామమాత్రపు వేతనాలు చెల్లిస్తుండగా, మరికొందరు రీఫిల్‌ డెలివరీపై కమీషన్‌ ఇస్తున్నారు. ఫలితంగా డెలివరీ బాయ్స్‌ వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయడం సర్వ సాధారణంగా మారింది. నిబంధనల ప్రకారం బాయ్స్‌ సిలిండర్‌ను డోర్‌ డెలివరీ చేసే సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్‌ నిర్ణీత బరువును వినియోగదారులకు చూపించాలి. అయితే ఈ నిబంధన ఎక్కడ కూడా అమలవుతున్న దాఖలాలు  లేవు. కేవలం బిల్లింగ్‌పై అదనపు బాదుడు తప్ప బరువు చూపించాలన్న  ధ్యాస లేకుండా పోయింది.  

నిబంధనలు ఇవీ 
⇔ వినియోగదారుడు ఆన్‌లైన్‌లో గ్యాస్‌ రీఫిల్‌ బుకింగ్‌  చేసుకున్న తర్వాత బిల్లు జనరేట్‌ చేసి డోర్‌ డెలివరీ చేయాలి 
⇔ ఏజెన్సీ నుంచి 5 కిలో మీటర్ల వరకు ఉచితంగా డోర్‌ డెలివరీ ఇవ్వాలి. 
⇔ ఏజెన్సీ నుంచి 6 కిలో మీటర్ల నుంచి 15 కిలో మీటర్లు ఉంటే రవాణా చార్జీల పేరుతో రూ.10 వసూలు చేయవచ్చు.  
⇔ 16 –30 కిలో మీటర్లు దూరం ఉంటే  రవాణా చార్జీగా రూ. 15 వసూలు చేయాలి  
⇔ వినియోగదారుడు సిలిండర్‌ రీఫిల్‌ను గ్యాస్‌ కంపెనీ గోదాముకు వెళ్లి తీసుకుంటే బిల్లులో రూ.8 మినహాయించాలి.  

మరిన్ని వార్తలు