ఎల్పీజీ ధరలో నెంబర్‌–2, పాట్నా తర్వాత హైదరాబాద్‌ టాప్‌

17 Jan, 2023 01:28 IST|Sakshi

దేశ రాజధాని కంటే ఇక్కడే రూ.52 అధికం 

నగరంలో డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.1,105  

సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్‌ ధర సామాన్య, మధ్య తరగతి ప్రజానీకాన్ని బాదేస్తోంది. దేశంలోని మెట్రో నగరాలతో పోల్చితే గృహోపయోగ సిలిండర్‌ ధర విషయంలో నగరం రెండో స్థానాన్ని ఆక్రమించింది. దేశ రాజధాని ఢిల్లీ, ఆ తర్వాత మెట్రో నగరాలైన ముంబయి, బెంగళూర్, చెన్నై, కోల్‌కతా, లక్నో కంటే హైదరాబాద్‌లోనే ఎల్పీజీ సిలిండర్‌ రీఫిల్‌ ధర అధికంగా ఉంది. విశ్వనగరం వైపు పరుగులు తీస్తున్న మహానగరానికి ఉద్యోగ, ఉపాధి, విద్య, వైద్యం దృష్ట్యా వలస వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న కుటుంబాలతో డొమెస్టిక్‌ ఎల్పీజీ గ్యాస్‌ వినియోగం బాగా పెరిగింది. అదే స్థాయిలో వాణిజ్య సిలిండర్లకు డిమాండ్‌ అధికమైంది. 

మార్కెట్‌ ధర ఇలా... 
మెట్రో నగరాల మార్కెట్‌తో పోల్చితే హైదరాబాద్‌ మార్కెట్‌లో సిలిండర్‌ రీఫిల్‌ ధర మండిపోతోంది. చమురు సంస్థలు రాష్ట్రానికోవిధంగా రవాణా దూరాన్ని బట్టి ధరను నిర్ణయించి అమలు చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ కంటే హైదరాబాద్‌లో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.52 అధికంగా ఉంది. డొమెస్టిక్‌ సిలిండర్‌పై సబ్సిడీ ఎత్తివేయడంతో బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారం మొత్తాన్ని భరించాల్సి వస్తోంది. 

ఐదు శాతం పన్నుల మోత 
వంటగ్యాస్‌ సిలిండర్‌ రీఫిల్‌కు రవాణా, పన్నులు మరింత భారంగా మారాయి. చమురు సంస్థలు రవాణా, జీఎస్టీ పన్నులు కలుపుకొని ప్రస్తుత మార్కెట్‌ ధర అనుసరించి హైదరాబాద్‌లో 14.2 కేజీల వంట గ్యాస్‌ సిలిండర్‌ సరఫరాకు రూ.1,105 వసూలు చేస్తున్నాయి. వాస్తవంగా సిలిండర్‌ ధర రూ.1052.38 ఉండగా దానిపై సీజీఎస్‌టీ 2.5 శాతం కింద రూ.26.31, ఎస్‌జీఎస్‌టీ 2.5 శాతం కింద రూ. 26.31 పన్నుల భారం పడుతోంది. 

రవాణా చార్జీలను బట్టి.. 
చమురు సంస్థలు గ్యాస్‌ రవాణా దూరాన్ని బట్టి సిలిండర్‌ ధర నిర్ణయిస్తున్నాయి. హైదరాబాద్‌ నగరం కంటే ఎల్పీజీ ధర ఆదిలాబాద్‌లో రూ. 25 అధికంగా ఉంది. మిగతా జిల్లాల్లో సైతం  కనీసం రూ. 20 నుంచి రూ. 27 వరకు అధికంగా ధర పలుకుతోంది. 

19 కేజీల వాణిజ్య సిలిండర్‌ టాప్‌ 
వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర కూడా మోత మోగిస్తోంది. ఢిల్లీ కంటే సుమారు రూ. 204 అధికంగా పలుకుతోంది. హైదరాబాద్‌లో సిలిండర్‌ ధర రూ రూ. 1973 ఉండగా, చెన్నైలో రూ. 1971, కోల్‌కతాలో రూ.1870 ఢిల్లీలో రూ. 1,769, ముంబయిలో రూ.1721 ప్రకారం ధర పలుకుతోంది. 

28.21 లక్షలపైనే... 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రధాన చమురు సంస్థలకు సంబంధించి సుమారు 28.21 లక్షల గృహోపయోగ వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు