క్రమబద్ధీకరణలో ఊరట

17 Sep, 2020 03:36 IST|Sakshi

రిజిస్ట్రేషన్‌ నాటి మార్కెట్‌ విలువ ఆధారంగా ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలు

శాసనసభలో మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన

‘ఎల్‌ఆర్‌ఎస్‌’కు నేడు సవరింపు ఉత్తర్వులు.. ఏళ్ల కింద ప్లాట్లు కొన్నవారికి ఉపశమనం

గత ఆరేళ్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిపై భారం యథాతథం

సాక్షి, హైదరాబాద్‌: లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుదారులకు భారీ ఊరట లభించింది. ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ సమయానికి ఉన్న మార్కెట్‌ రేట్ల ఆధారంగానే క్రమబద్ధీకరణ రుసుములు వసూలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 2020 ఆగస్టు 28 తేదీన అమల్లో ఉన్న భూముల మార్కెట్‌ విలువ ఆధారంగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు దారులు క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ జీవో (131)లో పేర్కొంది. చాలా ఏళ్ల కింద, అప్పటి మార్కెట్‌ విలువ ప్రకారం తక్కువ ధరకు ప్లాట్లను కొనుగోలు చేసిన వ్యక్తులు సైతం ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగాభారీగా క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి. గడిచిన దశాబ్దకాలంలో భూముల ధరలు ఎన్నో రెట్లు పెరిగిపోయాయి.

తాజా మార్కెట్‌ విలువ ప్రకారం చాలా చోట్ల 200 గజాల స్థలానికి సైతం రూ.లక్షల్లో క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రమబద్ధీకరణ రుసుములు అధికంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతుండటాన్ని శాసనసభ్యులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు దృష్టికి తెచ్చారు. దీంతో ఎల్‌ఆర్‌ఎస్‌ (జీవో 131) విషయంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉప్రకమించింది. బుధవారం శాసనసభలో మంత్రి కేటీఆర్‌ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఆయా స్థలాల రిజిస్ట్రేషన్‌ సమయంలో ఉన్న మార్కెట్‌ విలువ ప్రకారమే ఫీజులు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈమేరకు సవరించిన ఉత్తర్వును గురువారమే వెలువరించనున్నట్టు ప్రకటించారు. తాము తీసుకున్న చర్యల్లో ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకునేందుకు వెనకాడబోమని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునే ప్రభుత్వం తమదని కేటీఆర్‌ పేర్కొన్నారు. చాలా కాలం కింద భూములు కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వ నిర్ణయంతో భారీ ఉపశమనం లభించనుంది. ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ఎంత పాతది అయితే అంత ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు. 

ఆరేళ్లుగా అదే మార్కెట్‌ విలువ..
మరోవైపు గత ఆరేళ్లుగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ ధరల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. అంటే గత ఆరేళ్లలో రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారు యధావిధిగా భారీ మొత్తంలో క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. క్రమబద్ధీకరించుకోకపోతే అనధికార, అక్రమ ప్లాట్ల క్రయావిక్రయాల రిజిస్ట్రేషన్లను జరపమని, వీటిల్లో భవన నిర్మాణాలకు సైతం అనుమతులు జారీ చేయమని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్లాట్లు, లేఅవుట్ల యజమానులు నిర్బంధంగా క్రమబద్ధీకరించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది తమ ప్లాట్లను బేరానికి పెడుతున్నారు. కొనుగోలుదారులు బయానాగా క్రమబద్ధీకరణ చార్జీలు భరించాలని, ఆ తర్వాత మిగిలిన డబ్బులను రిజిస్ట్రేషన్‌లో సమయంలో తీసుకుంటామని ప్లాట్ల యజమానులు ఆఫర్‌ చేస్తున్నారు. 

మురికివాడల్లో మినహాయింపు ఇవ్వాలి...
భవన నిర్మాణ నిబంధనల ప్రకారం నోటిఫైడ్‌ స్లమ్స్‌లో భవన నిర్మాణ అనుమతుల జారీకి భారీ రాయితీలు, సడలింపులున్నాయి. ఇతర చోట్లలో వసూలు చేసే భవన నిర్మాణ చార్జీలతో పోల్చితే మురికివాడల్లో నాలుగో వంతు చార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నారు. అదే విధంగా లేఅవుట్‌ అనుమతులు లేకపోయినా /ఎల్‌ఆర్‌ఎస్‌ కింద క్రమబద్ధీకరణ చేసుకోకపోయినా మురికివాడల్లోని ప్రజల నుంచి ఇళ్ల నిర్మాణ అనుమతుల జారీ సమయంలో ఎలాంటి జరిమానాలు, చార్జీలు వసూలు చేయడం లేదు. తాజాగా ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద మురికివాడల్లోని స్థలాల క్రమబద్ధీకరణకు చదరపు మీటర్‌కు రూ.5 చొప్పున కనీస క్రమబద్ధీకరణ చార్జీలకు తోడుగా, స్థలం మార్కెట్‌ విలువ ఆధారంగా 25 శాతం నుంచి 100 శాతం వరకు క్రమబద్ధీకరణ చార్జీలుగా చెల్లించాల్సి రానుంది. మురికివాడల్లోని పేదలకు ఇది భారం కాబట్టి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు