లగ్జరీ వాహనాల క్రేజ్‌.. హైదరాబాద్‌ రోడ్లపై రూ.కోటి నుంచి రూ.7 కోట్ల ఖరీదైన కార్లు

25 Nov, 2022 08:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ రహదారులపై ఖరీదైన కార్లు దూసుకెళ్తున్నాయి. ‘హై ఎండ్‌’.. సిటీ ట్రెండ్‌గా మారింది. ఒకవైపు నగరం నలువైపులా ఆకాశమే హద్దుగా వెలిసే హైరేజ్‌  అపార్ట్‌మెంట్లు, విశాలమైన విల్లాలతో భాగ్యనగరం అంతర్జాతీయ హంగులను సంతరించుకొంటోంది. బడా కార్పొరేట్‌ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్‌ స్వర్గధామంగా మారింది. ఈ క్రమంలోనే నగరంలో తిరిగే హైఎండ్‌ కార్ల సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, కార్పొరేట్‌ సంస్థలు రూ.కోట్లు ఖరీదు చేసే కార్లను వినియోగిస్తున్నాయి.

పదేళ్ల క్రితం వరకు నగరంలో అక్కడక్కడా అరుదుగా మాత్రమే హైఎండ్‌ వాహనాలు కనిపించేవి. కానీ ఇప్పుడు అన్ని చోట్ల ‘భారీ బడ్జెట్‌’ విలాసవంతమైన కార్లు విరివిగా రోడ్డెక్కుతున్నాయి. విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో నగరానికి దిగుమతి అవుతున్నాయి. రవాణాశాఖ లెక్కల ప్రకారం ఏటా వెయ్యికి పైగా కార్లు, 300కు పైగా బైక్‌లు నమోదవుతున్నాయి.  

హై...రయ్‌.. 
హై ఎండ్‌ వాహనాల్లో  బైక్‌ల కంటే కార్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. రూ.50 లక్షల ఖరీదు చేసే ఫార్చునర్‌ లెజెండర్‌ వంటి కార్లు మొదలుకొని రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల ఖరీదు చేసే రోల్స్‌ రాయిస్‌ వంటి కార్ల వరకు ఇప్పుడు హైదరాబాద్‌ అంతటా కనిపిస్తున్నాయి. ఎగువ మధ్య తరగతి, ఒక స్థాయి సంపన్న వర్గాలు ఎంజీఎం హెక్టార్, ఇన్నోవా, కియా వంటి కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇదే సమయంలో పారిశ్రామిక, సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులలో హైఎండ్‌ కేవలం స్టేటస్‌ సింబల్‌గానే కాకుండా అభిరుచిగా కూడా మారింది.

దీంతో లంబోర్గిని, ఫెరారీ, బుగాటి, బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ, పోర్షే వంటి విలాసవంతమైన కార్లు రహదారులపై పరుగులు తీస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, నగరమంతటా పరుచుకున్న ఫ్లై ఓవర్లు, తళతళలాడుతూ దూసుకొనిపోయే ఈ లగ్జరీ కార్లతో హైదరాబాద్‌ అందం మరింత ద్విగుణీకృతమై కనిపిస్తోంది. అలాగే ఖరీదైన బైక్‌లు కేటీఎం, జావా, బుల్లెట్‌ వంటివి సైతం పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. 
చదవండి: కాలేజీలకు ‘ఐటీ’ టెన్షన్‌.. డొనేషన్ల వివరాలు చెప్పొద్దంటూ తల్లిదండ్రులకు ఫోన్లు 

ఇలా తగ్గి.. అలా పెరిగాయి.. 
కోవిడ్‌ మహమ్మారి విజృంభించిన 2020 సంవత్సరం మినహా హైఎండ్‌ వాహనాల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఆ ఒక్క సంవత్సరం మాత్రం 998 కార్లు, 342 బైక్‌లు ఆరీ్టఏలో కొత్తగా నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1,879 లగ్జరీ కార్ల విక్రయాలు జరిగాయి. బైక్‌ల సంఖ్య మాత్రం 309కి తగ్గుముఖం పట్టింది. రూ.లక్షలు వెచి్చంచి స్పోర్ట్స్‌ బైక్‌లు కొనుగోలు చేయడం కంటే కార్లు సొంతం చేసుకోవడం మంచిదనే భావనతో బైక్‌ల కొనుగోళ్లు కొద్దిగా తగ్గినట్లు షోరూంల నిర్వాహకులు చెబుతున్నారు. కోవిడ్‌ తర్వాత స్పోర్ట్స్‌ బైక్‌ల పట్ల యువతలో ఆసక్తి కూడా తగ్గినట్లు కనిపిస్తోందని ఆర్టీఏ  ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.  

అయిదేళ్లుగా హైఎండ్‌ వాహనాల నమోదు ఇలా..

సంవత్సరం     బైక్‌లు     కార్లు     మొత్తం  
2018 321 1,270 1,591 
2019 374 1,334 1,708
2020 342 998 1,340
2021 326 1,642 1,968
2022 309 1,879  2,188
మొత్తం   7,123 1,672  8,795

మరిన్ని వార్తలు