ఈ ఐదక్షరాల శాసనం  వయసు 2,200 ఏళ్లు

9 Aug, 2020 00:58 IST|Sakshi

మంజీరా పరీవాహకంలో అపురూప లఘు శాసనం\

అశోక బ్రాహ్మీ లిపిలో అక్షరాలు

 శాతవాహన తొలితరం నాటిదిగా గుర్తింపు 

తెలంగాణలో అతిపురాతన  చెక్కడం ఇదే.. 

కామారెడ్డి జిల్లా మాల్‌తుమ్మెదలో వెలుగులోకి.. 

సాక్షి, హైదరాబాద్ ‌: ఇదో శాసనం.. శాసనమంటే వాక్యాల సమాహారం కాదు, కేవలం ఐదక్షరాల పదం. ఆ పదానికి స్పష్టమైన అర్థం వెతకాల్సి ఉంది. అది చెక్కింది నిన్న మొన్న కాదు, దాదాపు 2,200 ఏళ్ల క్రితం. అంటే.. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దమన్నమాట. ఇది ఇంతకాలం ఓ గుండుపై అనామకంగా ఎదురుచూస్తూ ఉంది. మరి ఆ మాటకు స్పష్టమైన అర్థం ఏంటో ఎవరికీ తెలియదు. అసలు అది మన తెలుగు భాష, లిపి కాదు. అచ్చమైన ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపిలో లిఖించి ఉంది. అది కూడా అప్పుడప్పుడే శాతవాహన యుగం మొదలవుతున్న తరంనాటిది. అంటే.. అశోకుడి హయాంలో వాడిన లిపిలో ఉండటమే దీనికి తార్కాణం. వెరసి తెలంగాణ లో ఇప్పటివరకు వెలుగు చూసిన శాసనాల్లో ఇదే అతిపురాతనమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకాలం కృష్ణా, గోదావరి నదుల తీరాల్లో శాసనాలు ఎన్నో వెలుగుచూడగా, ఇది మంజీరా పరీవాహక ప్రాంతంలో బయటపడటం గమనార్హం. 

మంజీరా నదికి 500 మీటర్ల దూరంలో... 
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపల్లి మండలంలోని మాల్‌తుమ్మెద గ్రామ శివారులో ఈ అపురూప లఘు శాసనం తాజాగా వెలుగుచూసింది. ఆదిమానవుల జాడ మొదలు ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా ఉన్న ఈ గ్రామంలో ఇంత పురాతన చెక్కడం బయటపడటం విశేషం. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలతోపాటు బౌద్ధ ఆధారాలున్న ధూళికట్ట, కొండాపూర్, బోధన్‌ తదితర ప్రాంతాల్లో క్రీ.శ. ఒకటో శతాబ్దానికి చెం దిన శాసనాలు గతంలో వెలుగు చూసిన విష యం తెలిసిందే. కానీ, అంతకు కనీసం 200 ఏళ్ల పూర్వం నాటి శాసనం ఇప్పుడు ఇక్కడ బయటపడింది. మంజీరా నదికి 500 మీటర్ల దూరంలో పెద్ద బండరాయిపై ఈ అక్షరాలు చెక్కి ఉన్నాయి. 

‘మాధవచంద’ అంటే..
‘‘తెలుగులో ఈ శాసనం అర్థం ‘మాధవచంద’. ఇది వ్యక్తి పేరో, ప్రాంతం పేరో, వీటికి సంబం ధంలేని మరే అర్థమో అయి ఉండవచ్చు. దాని పై ఇంకా స్పష్టత లేదు. ఆ ఒక్క పదమే ఇక్కడ ఎందుకు చెక్కి ఉందో కనుగొనాల్సి ఉంది. ఎన్నో చారిత్రక ఆధారాలకు నెలవుగా ఉన్న ఆ గ్రామంలో దీనిపై మరింత పరిశోధన జరిపితే మరిన్ని వివరాలు వెలుగుచూసే అవకాశం ఉంది. కానీ, తొలి శాతవాహన కాలం నాటి గుర్తులు ఇక్కడ ఉన్నాయనేది ఈ శాసనంతో స్పష్టమైంది’’అని ఆ శాసనాన్ని పరిశీలించిన చరిత్ర పరిశోధకులు ఎం.ఎ.శ్రీనివాసన్‌ పేర్కొ న్నారు. సర్వేయర్‌గా ఉంటూ చరిత్ర పరిశోధనలో ఆసక్తి చూపుతున్న శంకర్‌రెడ్డి దీన్ని తొలుత గుర్తించారు. హెరిటేజ్‌ తెలంగాణ విశ్రాంత అధికారి వై.భానుమూర్తితో కలసి తాను పరిశీలించినట్టు వెల్లడించారు. ఆ అక్ష రాల నిగ్గు తేల్చేందుకు తాను సంప్రదించగా, అవి తొలి శాతవాహన కాలం నాటి లిపితో ఉన్నాయని ఏఎస్‌ఐ ఎపిగ్రఫీ విభాగం సంచాలకులు పేర్కొన్నట్టు శ్రీనివాసన్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు