రామాంతపూర్ నారాయణ కాలేజీ ఘటనపై స్పందించిన మధుయాష్కీ

19 Aug, 2022 17:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రామాంతపూర్ నారాయణ కాలేజీ ఘటనపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధు యాష్కీ గౌడ్ డిమాండ్‌ చేశారు. నారాయణ యాజమాన్యంపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఆ విద్యాసంస్థల అనుమతులు వెంటనే రద్దు చేయాలన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే విద్యార్థి విద్యా సంవత్సరం కోల్పోతాడు.. ఫీజులు కట్టకపోతే వేరే మార్గాల ద్వారా తీసుకోవాలి తప్ప.. సర్టిఫికెట్లు ఇవ్వవద్దని ఏ చట్టంలోనూ లేదు. నారాయణ యాజమాన్యం చేసింది.. రాజ్యాంగ వ్యతిరేక చర్య.. ఇది అత్యంత హేయమైన, దారుణమైన చర్యగా ఆయన అభివర్ణించారు.
చదవండి: ‘ఫీజు విషయంలోనే వివాదం.. ప్రిన్సిపాల్‌ వెనక్కి తగ్గకపోవడంతో’..

తెలంగాణ ఉద్యమ సమయంలో కార్పొరేట్‌ కాలేజీలు దోచుకుంటున్నాయని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మండల కేంద్రాల్లోకి సైతం నారాయణ, చైతన్య కాలేజీలు విస్తరించాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లో సైతం ఇవి లేవు. మండల కేంద్రాలకు సైతం నారాయణ, చైతన్య విద్యాసంస్థలు వచ్చి.. ప్రజల రక్తాన్ని తాగుతున్నాయని.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు... తగిన చర్యలు తీసుకోలేదని మధుయాష్కీ మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు