చలాన్ల బాదుడు.. కేసీఆర్‌ ఎన్ని కోట్లు వసూలు చేశారో తెలుసా?: మధు యాష్కీ

20 Aug, 2022 15:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశారు. తాజాగా ప్రజల రక్తమాంసాలను పీల్చేస్తూ.. ట్రాఫిక్ చలాన్ల రూపంలో కేసీఆర్‌ సర్కార్‌ మరో స్కామ్ చేస్తోందని కాంగ్రెస్‌ నేత, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ మండిపడ్డారు. 

మధు యాష్కీ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో 2014లో ట్రాఫిక్ చలాన్ల కేసులు 50 లక్షలుగా ఉండి ఫైన్ల రూపంలో వసూలు చేసిన మొత్తం రూ. 95 లక్షలుగా ఉంది. ఇక, కేసీఆర్‌ సర్కార్‌ పాలనలో 2021లోనే కేసుల సంఖ్య 2 కోట్లకు పైనే ఉండగా.. చలాన్ వేసిన మొత్తం రూ.877 కోట్లకు చేరింది.  టీఆర్‌ఎస్‌ ఎనిమిదేళ్ల పాలనలో 9 కోట్ల కేసులు పెట్టి.. రూ. 2,671 కోట్ల రూపాయలను ఫైన్లుగా వసూలు చేశారు.  

అర్దరాత్రి వరకూ బార్లకు, వైన్ షాపులకు అనుమతులు ఇచ్చి.. ఆయా షాపులు పక్కనే చీకట్లో మాటేసి, డ్రంకన్ డ్రైవ్ పేరుతో చలాన్లు బాదేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం దారి దోపిడీ దొంగల కన్నాహీనంగా మారి చలాన్లు, ఫైన్ల పేరుతో నిలువు దోపిడీ చేస్తోంది. ట్రాఫిక్ అధికారులను కేవలం ఫొటోలు తీసేందుకు, చలాన్లు రాసేందుకు మాత్రమే అన్నట్లుగా మార్చేసింది. 

ఇన్ని వేల కోట్ల రూపాయలను దోచుకుని కూడా హైదరాబాద్‌ నగరంలో రోడ్లను మాత్రం బాగుచేయడం లేదు. చలాన్ల సొమ్మును ఎక్కడ ఖర్చు పెట్టిందే శ్వేత పత్రం విడుదల చేయాలి. ఔరంగజేబు జిజియా పన్ను వేసినట్లుగా కేసీఆర్ వాహనదారులపై చలాన్ల పన్నేస్తూ జేబులు గుల్ల చేస్తున్నాడు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు చలాన్లపై కేసీఆర్‌ సర్కార్‌ను నిలదీయాలి’’ అని కోరారు.  

ఇది కూడా చదవండి: మల్లారెడ్డా మజాకా మామూలుగా ఉండదు.. మాస్‌ డ్యాన్స్‌తో ఇరగదీసిండు..

మరిన్ని వార్తలు