మానవత్వం చాటుకున్న కోరుట్ల మెజిస్ట్రేట్‌

2 Jul, 2021 07:37 IST|Sakshi
నవనీతకు దుస్తులు అందిస్తున్న మెజిస్ట్రేట్‌ శ్యామ్‌కుమార్‌

సాక్షి, మేడిపెల్లి(వేములవాడ): మేడిపెల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిట్టితల్లి నవనీత దీనస్థితికి చలించిపోయారు కోరుట్ల మెజిస్ట్రేట్‌ జె.శ్యామ్‌కుమార్‌. గురువారం చిట్టితల్లి ఇంటికి వచ్చి నోట్‌పుస్తకాలు, పెన్నులు, బ్యాగ్‌లు, పండ్లు, దుస్తులతోపాటు ఆర్థికసాయం అందించి మానవత్వం చాటుకున్నారు. దమ్మన్నపేటకు చెందిన పడకంటి నవనీత తల్లిదండ్రులను కోల్పోయింది. జూన్‌ 16న సాక్షి దినపత్రికలో ‘చిట్టితల్లికి ఎంతకష్టం’శీర్షికన కథనం ప్రచురితమైంది.

ప్రభుత్వ న్యాయవాది కట్కం రాజేంద్రప్రసాద్‌ కోరుట్ల మెజిస్ట్రేట్‌ దృష్టికి తీసుకెళ్లగా చలించిన ఆయన స్వయంగా చిట్టితల్లి దగ్గరకు వచ్చి సాయం అందజేశారు. అదైర్య పడొద్దని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చదివి ఉన్నతంగా ఎదగాలని సూచించారు. అనాథ పిల్లలకు కోర్టులు కూడా అండగా ఉంటాయని ధైర్యం చెప్పారు. అనంతరం గ్రామానికి వచ్చిన జడ్జిని గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కాచర్ల సురేశ్, హెచ్‌ఎం రాజు, పంచాయతీ కార్యదర్శి రవిరాజ్, ఉపాధ్యాయులు మురళీకృష్ణ, సత్యనారాయణ, శంకర్, అడ్లగట్ట ప్రకాశ్, బండ్ల గజానందం, బండ్ల నరేశ్‌ ఉన్నారు. 

చదవండి: చనిపోయాడనుకున్న వ్యక్తి ప్రత్యక్షమవడంతో.. 

మరిన్ని వార్తలు