చెర్రీ చిల్లి: ఈ మిర్చి చాలా హాట్‌ గురూ..!

27 Apr, 2021 14:36 IST|Sakshi

సాక్షి, కోస్గి: మిరపకాయ అంటేనే కారం గుర్తుకు వస్తుంది. సాధారణ స్థాయి దాటి కారం మోతాదు ఏమాత్రం పెరిగినా తట్టుకోలేం కూడా. అయితే అత్యంత ఘాటైనా మిరప రకాల్లో ఓ రకం మిరపను పట్టణానికి చెందిన సైన్స్‌ ఉపాధ్యాయుడు వార్త మల్లేశం తన ఇంటి పెరట్లోని కుండీలలో ప్రత్యేక వాతావరణ పరిస్థితుల మధ్య పెంచుతున్నారు. వారం రోజుల నుంచి కాయలు కాస్తూ ఈ మిరప తన ప్రత్యేకతను చాటుతుంది. వృక్ష రాజ్యంలోని సోలనేసి కుటుంబానికి చెందిన ఈ మిరప రకాన్ని ‘డల్లే కుర్సని’ అనే పేరుతో పిలుస్తారని, సిక్కిం రాష్ట్రంలో ఈ మిరప భౌగోళిక గుర్తింపు పొందిందని దీన్ని చెర్రీ చిల్లి, రౌండ్‌ చిల్లి అనే పేర్లతో కూడా పిలుస్తారని పేర్కొన్నారు.

దీని కారం లక్ష నుంచి 3.5 లక్షల ఎస్‌హెచ్‌యూ(కారం కొలిచే ప్రమాణం స్కావిల్‌ స్కేల్‌ యూనిట్స్‌) ఉంటుందని, మనం వాడే మిరప కేవలం 30 వేల ఎస్‌హెచ్‌యూ వరకే ఉంటుందన్నారు. మన దేశానికి చెందిన ఈ మిరప ప్రపంచంలోనే ఘాటైన మిరపకాయల జాబితాలో ఉందని, ఇందులో విటమిన్‌ ఏ, ఈ, పొటాషియం మెండుగా, సోడియం తక్కువ స్థాయిలో, నారింజ పండులో కన్నా 5 రెట్లు  మిటమిన్‌ సి ఉంటుదన్నారు. విహార యాత్రలకు వెళ్లిన సందర్భంలో ఈ విత్తనాలు సేకరించినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు