ముక్కుతో ఫ్లూటు వాయిస్తూ.. అలరిస్తోన్న వ్యక్తి

10 Dec, 2020 12:05 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్: ప్రతి ఒక్కరిలో ఏదో ఓ కళ ఉంటుంది. దాన్ని గుర్తించి సాధన చేస్తే అందులో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. నోటితో వేణుగానం చేయటం సహజమే.. కాని మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి పిల్లనగ్రోవిని ముక్కుతో వాయించి ఆశ్చర్య పరుస్తున్నాడు. ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామానికి చెందిన గట్టు కురుమన్న కుటుంబ పోషణ కోసం గడచిన 30 ఏళ్లుగా పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. వాటిని మేపే క్రమంలో ఖాళీ సమయాన్ని వృధా చేయటం ఎందుకని భావించిన ఆయన కురుమూర్తి స్వామి జాతరలో ఓ ప్లూట్‌ కొనుగోలు చేసి సినిమా పాటలు, జానపద గేయాలు ఆలపించటం మొదలు పెట్టాడు. ఇలా అందరు చేస్తారు... కానీ తాను ప్రత్యేక ఉండాలని భావించి ముక్కుతో ప్లూట్ వాయించటం సాధన చేశాడు కురుమన్న. సక్సెస్ అయ్యాడు.
 
ప్రస్తుతం కురుమన్న ముక్కుతో ఫ్లూట్ వాయిస్తూ మధుర గీతాలు ఆలపిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. చుట్టుపక్కల గ్రామాల్లో తనకుంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ముక్కుతో గానం చేస్తున్న తనకు గ్రామస్తుల నుంచేకాక ఇతర ప్రాంతాల వారిని నుంచి ఆదరణ లభిస్తుందని అంటున్నాడు కురుమన్న. ఎవరికైనా ఆసక్తి ఉంటే తాను వారికి ముక్కుతో ఫ్లూట్ వాయించటం నేర్పుతానని అంటున్నాడు.

మరిన్ని వార్తలు