ఎమ్మార్పీఎస్ వర్సెస్‌ బీజేపీ.. మహబూబ్‌నగర్‌లో ఉద్రిక్తత.. బండిని కలిసిన మరునాడే..

24 Jan, 2023 14:38 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రంలో మంగళవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, బీజేపీ కార్యకర్తల నడుమ ఘర్షణ జరిగింది. కర్రలతో ఇరు వర్గాలు దాడికి దిగగా.. అడ్డుకునే యత్నం చేసిన ఓ కానిస్టేబుల్‌ గాయపడ్డాడు. మరోవైపు పోలీస్‌ వాహనం సైతం ధ్వంసం కావడంతో..  నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఎస్సీ వర్గకరణ సమస్య పరిష్కారం డిమాండ్‌తో ర్యాలీ చేపట్టిన ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు.. అన్నపూర్ణ గార్డెన్‌ వద్దకు చేరుకుని భారీ ఎత్తున​ నినాదాలు చేశారు. అదే సమయంలో లోపల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. బయటకు వచ్చిన బీజేపీ కార్యకర్తలు, ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలపై బాహాబాహీకి దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో.. ఓ కానిస్టేబుల్‌కు గాయాలు కాగా, ఓ పోలీస్‌ వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. 

ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కార డిమాండ్‌తో ఎమ్మార్సీఎస్‌ ఆందోళన చేపట్టింది. అయితే ఈ వ్యవహారంలో బీజేపీ వైఖరి, కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని ఎమ్మార్పీఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. ఇక గత రాత్రి ఎమ్మార్పీఎస్‌ ప్రతినిధుల బృందం ఒకటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసి ఈ మేరకు ఓ వినతి పత్రం సమర్పించాయి కూడా. అయినప్పటికీ మరుసటి నాడే  ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడంతో.. దీని వెనుక ఎవరైనా ఉన్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది బీజేపీ. 
 

మరిన్ని వార్తలు