భూమి కోసం పోరు.. 

14 May, 2022 01:52 IST|Sakshi
తహసీల్దార్‌ బక్క శ్రీనివాసులును నిలదీస్తున్న రైతులు   

హన్వాడలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ భూసేకరణలో గడబిడ 

అసైన్డ్‌ భూమి స్వాధీనం చేసుకోవడంపై దళితుల ఆందోళన 

నిరసనగా రాజ్యసభ బరిలో స్థానిక రైతు మాసయ్య  

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు అక్కడి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు తమ భూములను ఇవ్వబోమంటూ ఐదారు రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలిపిన అన్నదాతలు శుక్రవారం తమ ఆందోళనను ఉధృతం చేశారు.

మరోవైపు హన్వాడకు చెందిన రైతు బొక్కి మాసయ్య హైదరాబాద్‌కు వెళ్లి రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 500 ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని గతంలోనే అధికారులు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా హన్వాడలో 718 సర్వే నంబర్‌లో 3,100 ఎకరాల ప్రభుత్వభూమి ఉందని అధికారులు గుర్తించారు.

మొదటి విడతగా రెవెన్యూ అధికారులు 240 ఎకరాలను సేకరించి ప్రభుత్వానికి అందజేశారు. అయితే, 50 ఏళ్ల క్రితమే ఈ భూమిలో కొంత భాగాన్ని అధికారులు అసైన్‌మెంట్‌ కింద దళిత, బీసీ రైతులకు కేటాయించారు. ఇప్పటికే 718 సర్వే నంబర్‌లో 144 మంది రైతులు 86.28 ఎకరాలు, పక్కనే ఉన్న 456 సర్వే నంబర్‌లో సుమారు 30 మంది రైతులు 60 ఎకరాల మేర సాగుచేసుకుంటున్నారు.  

పోలీస్‌ పహారాలో సేకరణ యత్నం..: తహసీల్దార్‌ బక్క శ్రీనివాసులు శుక్రవారం రెవెన్యూ బృందంతో కలిసి 718, 456 సర్వే నంబర్‌లో సర్వేకు వెళ్లారు. అదే సమయంలో పోలీస్‌ బలగాలు సైతం అక్కడికి చేరుకున్నాయి. భూమికి సరిపడా సాగుకు యోగ్యమైన భూమి ఇవ్వాలని, ఇంటి స్థలం ఇవ్వాలని తహసీల్దార్‌ను రైతులు నిలదీశారు.

భూమి కోల్పోతున్న ప్రతి రైతుకు భూమికి బదులుగా వేరే చోట కేటాయిస్తామని తహసీల్దార్‌ భరోసా ఇవ్వడంతో వారు శాంతించారు. ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సైతం తహసీల్దార్‌కు ఫోన్‌ చేసి భూమిని కోల్పోతున్న ప్రతి రైతుకు సాగుకు యోగ్యమైన భూమితోపాటు ఇంటిస్థలానికి పట్టా లివ్వాలని, ఈ మేరకు ప్రొసీడింగ్స్‌ తీసుకోవాలని, తర్వాతే భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు.  

మేము ఎటెళ్లాలి: ఆంజనేయులు, రైతు, హన్వాడ 
మాకు 4 ఎకరాలుంది. వంశపారం పర్యంగా సాగు చేసుకుంటున్నాం. భూమిని రూ.2 లక్షలు పెట్టి చదును చేసుకున్నాం. మరో రూ.2 లక్షలు వెచ్చిం చి మూడు బోర్లు వేయించాం. భూమిని వదిలిపెట్టాలని అధికారులు చెబుతున్నారు. మేం ఎటెళ్లాలి. భూసేకరణకు ముందుగా పొజిషన్‌ చూపించి పట్టాలు ఇవ్వాలి.

రాజ్యసభకు హన్వాడ దళితరైతు నామినేషన్‌ 
తమకు కేటాయించిన భూములను లాక్కుంటున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేసేందుకు హన్వాడకు చెందిన సుమారు 15 మంది రైతులు గురువారంరాత్రి హైదరాబాద్‌కు వెళ్లారు.

ఈ క్రమంలో దళితరైతు బొక్కి మాసయ్య శుక్రవారం రాజ్యసభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. మాసయ్యకు 718 సర్వే నంబర్‌లో 1.17 ఎకరాల భూమి సాగులో ఉంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటులో తన భూమిని కోల్పోతుండటంతో నిరసనగా రాజ్యసభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసినట్లు ఆయన వెల్లడించారు.  

మరిన్ని వార్తలు