బాలికల పాఠశాలలో దారుణం.. రెండు జడలు వేసుకోలేదని 200 గుంజీలు, దాంతో

5 Aug, 2022 07:42 IST|Sakshi
సిక్‌రూంలో ఉన్న బాలికలు 

50 మంది విద్యార్థినులతో 200 గుంజీలు తీయించిన పీఈటీ 

నడవలేని స్థితిలో బాలికలు

తల్లిదండ్రుల ధర్నాతో బయటకు వచ్చిన విషయం 

జడ్చర్ల మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఘటన 

జడ్చర్ల టౌన్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణం కావేరమ్మపేటలో ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థినులు రెండు జడలు వేసుకోలేదని ఆగ్రహించిన పీఈటీ శ్వేత బుధవారం వారితో 120 నుంచి 200 వరకు గుంజీలు (ఉట్‌బైట్‌) తీయించింది. దీంతో పిల్లలు నడవలేని స్థితికి చేరుకున్నారు. నొప్పులు తాళలేక రోదిస్తున్నారు.

అయితే విషయం బయటకు పొక్కకుండా ఉపాధ్యాయులు తీవ్ర ప్రయత్నం చేశారు. 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికాగా, కొందరికి జ్వరం వచ్చింది. కనీసం వైద్యాధికారులకు సమాచారం ఇవ్వకుండా తమకు తోచినవిధంగా ఉపశమన చర్యలు తీసుకుని సిక్‌రూంలో తాళం వేసి బంధించారు. గురువారం మధ్యాహ్నం 20 మందికి జ్వరం తీవ్రం కావడంతో అర్బన్‌హెల్త్‌ సెంటర్‌కు తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు.

అయితే నొప్పులు భరించలేక కొందరు పిల్లలు తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వడంతో వారు పాఠశాల వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. బుధవారం జరిగిన ఈ ఘటన తల్లిదండ్రుల ధర్నాతో గురువారం బయటకు వచ్చింది. అక్కడికి వెళ్లిన విలేకరులను సైతం ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. ఇంత జరిగినా.. సెలవులో ఉన్న ప్రిన్సిపాల్‌ కల్పనకు గురువారం సాయంత్రం వరకు సమాచారం అందించలేదు.

విషయం బయటకు పొక్కగానే ఆమె పాఠశాలకు చేరుకుని చిన్న విషయమే.. అంటూ దాటవేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న గురుకులాల ఆర్‌ఎల్‌సీ జమీర్‌ అహ్మద్‌ పాఠశాలకు చేరుకున్నారు. ఆయన కూడా ఇది చిన్న విషయమేనని పేర్కొన్నారు. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాంట్రాక్ట్‌ పద్ధతిపై పనిచేస్తున్న పీఈటీ శ్వేతను విధుల్లోంచి తొలగిస్తున్నట్లు జమీర్‌ అహ్మద్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు