‘ఆ నలుగురు’ లేక వృద్ధ దంపతుల ఆత్మహత్య

9 Apr, 2021 14:57 IST|Sakshi

నసురుల్లాబాద్‌ (బాన్సువాడ): తమను చూసేవారెవరూ లేరనే మనోవేదనతో వృద్ధ దంపతులు మనోవేదనకు గురయ్యారు. దీంతో ఉన్న ఇల్లు విక్రయించి వచ్చిన డబ్బులతో పుణ్యక్షేత్రాలు తిరిగారు. ఆ తిరుగుతున్న సమయంలోనే వారి వద్ద ఉన్న డబ్బులు అయిపోవడంతో చివరకు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌లో జరిగింది.

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా బిలోలి గ్రామానికి చెందిన గంగాధర్‌ గిరి (70), మహానంద (65) భార్యాభర్తలు. వీరికి సంతానం లేకపోవడంతో వృద్ధాప్యంలో వారి బాగోగులు చూసేవారు ఎవరూ లేరు. దీంతో వారు మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో తమ గ్రామంలో ఉన్న ఇంటి స్థలాన్ని అమ్మేసి వచ్చిన డబ్బులతో మూడు నెలలుగా పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. ఇందులో భాగంగా నసురుల్లాబాద్‌లోని కొచ్చరి మైశమ్మ ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించారు.

అయితే తీర్థయాత్రలు చేస్తున్న క్రమంలో చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోయాయి. దీంతో గురువారం భార్యాభర్తలు నిజాంసాగర్‌ ప్రధాన కాలువ వెంట ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రం ప్రాంతంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం గమనించిన అక్కడి స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. అప్పటికే భర్త మృతిచెందగా, భార్య బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ నలుగురు లేక ఆ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలచివేస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు