Huzurabad By Election Bypoll 2021: ఓటే ఆయుధం.. అందరూ వేయండి

2 Oct, 2021 07:54 IST|Sakshi

ఓటే ఆయుధం.. అందరూ వేయండి‘మనం మనకోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది.’  – జాతిపిత మహాత్మాగాంధీ

సాక్షి, కరీంనగర్‌: అహింసే ఆయుధంగా.. సహనమే డాలుగా దేశానికి స్వేచ్ఛావాయువులందించిన మహోన్నతుడు మన జాతిపిత మహాత్మాగాంధీ. ఆంగ్లేయుల బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించిన స్ఫూర్తి ప్రధాత. రాజకీయాల్లో అడుగడుగునా విలువలు పెరగాలని.. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ఆకాంక్షించిన గొప్ప వ్యక్తి. పల్లెలే పట్టుగొమ్మలుగా సిద్ధాంతాలతో కూడిన నాయకత్వం పెంపొందాలని పరితపించిన ఆదర్శనీయుడు కోట్లాది మంది భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వేళ ఓటర్లు, అభ్యర్థులు, ఎన్నికల యంత్రాంగం బాపూజీ మాటల్ని మననం చేసుకొని, విలువల మంత్రాల్ని ఆచరించాల్సిన తరుణమిది.

ఓటరన్నా.. విలువ కాపాడుకో..
ఓటు విషయంలో నీ విలువ కాపాడుకో. మంచి నాయకుడిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకునేందుకు ఓటు అనే ఆయుధాన్ని వాడుకోవాలి. హుజూరాబాద్‌ ఎన్నికలో మొత్తం 305 పోలింగ్‌ కేంద్రాలు వినియోగిస్తుండగా 2,36,283 మంది ఓటర్లున్నారు. ప్రతిఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలి. మంచి నాయకుడికి పట్టం గట్టాలి.

సిద్ధాంతాలు లేని రాజకీయాలు వ్యర్థం
ఎన్నికల్లో గెలుపోటములు సహజం. విలువలతో ప్రజల మనసుని గెలవాలి. సిద్ధాంతాలకు లోబడి ఉండలేని రాజకీయాలు వ్యర్థం. అందుకే ఇచ్చిన మాటకు కట్టుబడాలి. ఆయా పార్టీల అభ్యర్థులుగా బరిలో ఉండే నాయకులంతా ప్రజాసేవపై దృష్టి సారించాలి.  

విలువలకు కట్టుబడాలి..
విధి నిర్వహణకు మించిన సేవ లేదు. విలువలకు కట్టుబడకుండా.. వ్యక్తిత్వాన్ని కోల్పోయి సేవలందించినా అది నిరుపయోగమే. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించడంలో బాధ్యత ముఖ్యమన్నది మరవొద్దు. చెడుకు సహాయ నిరాకరణ చేయడం ద్వారా విలువల్ని పరిరక్షించవచ్చు. బంధుప్రీతి.. ఇతర వ్యామోహాలకు వెరవకుండా ఎన్నికల్లో సమర్థంగా పనిచేస్తే ఎన్నికల ఆశయానికి ఊపిరిపోసినట్లే.  

నైతికత.. పారదర్శకత
అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు.. రంగు గో డలు కాదు. పౌరుల నైతికాభివృద్ధే నిజమైన అభివృద్ధి. అలాగే నాయకులు అందించే పాలనలో పారదర్శకత ముఖ్యం. సమాజానికి మేలు చేయాలనే భావన నాయకుల హృదయాంతరాల్లో నుంచి రావాలి. అందుకు ప్రణాళికతో కూడిన సాధన అవసరం. ప్రగతితో కూడిన పాలన నిత్యం అత్యవసరం.

మద్యం జోలికి వెళ్లకండి..
ప్రజాస్వామ్య వ్యవస్థ పునర్నిర్మాణంలో యువతే కీలకం. నేను కన్న కలల లోకంలో విహరించాలంటే నా బాటలో నడవండి. అహింసాయుత జీవనానికి నాంది పలకండి. ఏరులై పారే మద్యం జోలికి ఈ ఎన్నికల్లో అసలు వెళ్లకండి. ఎవరినీ వెళ్లనివ్వకండి. 305 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఓటర్లను ప్రలోభపెట్టే అవినీతి సొమ్ము సహా మద్యాన్ని కట్టడి చేసేలా ఊరూరా మీ బాధ్యత చూపండి. స్వచ్ఛమైన మనసుతో ఆలోచించండి. అసత్య ప్రచారాల్ని నమ్మకండి. నీతి, నిజాయతీలకు పట్టం కట్టండి. 

చదవండి: తొలి రోజు మూడు నామినేషన్ల దాఖలు

మరిన్ని వార్తలు