Maheema Gajaraj: చిన్ననాటి కల.. చిదిమేసిన మృత్యు విహంగం

28 Feb, 2022 17:07 IST|Sakshi

పైలట్‌ కావాలన్నది ఆమె చిన్ననాటి కల. తన స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి అమెరికాలో ఉద్యోగాన్ని సైతం వదులుకుని స్వదేశానికి తిరిగివచ్చారు. తన కల నేరవేరే సమయంలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు మహిళా శిక్షణ పైలట్‌ మహిమా గజరాజ్‌ (29).  మరి కొన్ని నెలల్లోనే పైలట్‌ శిక్షణ ముగుస్తుందనగా ఆమె అనూహ్యంగా దుర్మరణం చెందడం విషాదం.  

నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామ సమీపంలో శనివారం జరిగిన ప్రమాదంలో మహిమ మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆమెకు.. బాల్యం నుంచే పైలట్‌ కావాలని కోరిక. పీజీ పూర్తైన తర్వాత అమెరికా ఉద్యోగంలో చేరారు. పైలట్‌ కావాలన్న సంకల్పంతో అమెరికాను వదిలి స్వదేశానికి తిరిగివచ్చారు. భర్త పరంథామన్‌, కుటుంబ సభ్యులను ఒప్పించి పైలట్‌ శిక్షణలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రైట్‌ బ్యాంక్‌ సమీపంలో ఉన్న ఫ్లైటైక్‌ ప్రైవేట్‌ ఏవియేషన్‌ అకాడమీలో గత ఐదారు నెలలుగా శిక్షణ తీసుకుంటున్నారు. ట్రైనింగ్‌లో చేరిన నెల రోజుల్లోనే చాలా వరకు మెలకువలు నేర్చుకుని.. బెస్ట్‌ ట్రైనీగా నిలిచారు. మహిమకు తోడుగా ఆమె తల్లి, భర్త.. రైట్‌ బ్యాంక్‌ సమీపంలోనే నివసిస్తున్నారు. 

విషాదం వెంట విషాదం
కొద్ది రోజుల క్రితమే మహిమ తండ్రి గజరాజ్‌.. కరోనా బారిన పడి కన్నుమూశారు. ఇంతలోనే మరో విషాదం చోటు చేసుకోవడంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే శిక్షణలో చురుకైన  అభ్యర్థిగా ఉన్న మహిమ.. ప్రమాదానికి గురికావడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు 85 గంటలు విమానంను నడిపారని, ఇందులో 25 గంటలు సింగిల్‌గా నడిపిన అనుభవం ఉందని ఫ్లైటైక్‌ ప్రైవేట్‌ ఏవియేషన్‌ అకాడమీ సీఈవో మమత తెలిపారు.

ఊహాగానాలు వద్దు.. వాస్తవాలు కావాలి
ప్రమాదం ఎలా జరిగిందన్న వానిపై వాస్తవాలు వెల్లడించాలని మహిళ గజరాజన్‌ భర్త పరంథామన్‌ కోరారు. భర్తను, ఒక్కగానొక్క కూతురిని పోగొట్టుకుని తన అత్తగారు కుప్పకూలిపోయారని చెప్పారు. ప్రమాదం జరిగిన రూట్‌లో ఇంతకుముందు కూడా తన భార్య విమానం నడిపారని, కానీ ఇప్పుడు ఏమైందనేది తమకు తెలియాలని అన్నారు. తమ ప్రశ్నలకు సమాధానాలు కావాలన్నారు. అక్టోబర్‌ చివరినాటికి ట్రైనింగ్‌లో చేరే నాటికే థియరీ పూర్తైందని, 185 ఫైయింగ్‌ అవర్స్‌ కోసం శిక్షణకు వచ్చినట్టు చెప్పారు. ఏప్రిల్‌/మే నాటికి ట్రైనింగ్‌ పూర్తి చేయాలని మహిమ అనుకుందని వెల్లడించారు. 

అదంతా అబద్దం
ఆన్‌లైన్‌ ట్రేడర్‌గా పనిచేస్తున్న పరంథామన్‌ కూడా గతంలో పైలట్‌గా శిక్షణ తీసుకున్నారు. అయితే ఆయన పైలట్‌ శిక్షణ పూర్తిచేయలేకపోయారు. మహిమ నాలుగు నెలల గర్భిణి అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. ‘ఇదంతా అవాస్తవం. నా భార్య గర్భంతో ఉంటే విమానం నడిపే సాహసం ఎందుకు చేయనిస్తాం?’అని ప్రశ్నించారు. కాగా, శిక్షణ విమానం కుప్పకూలిన దుర్ఘటనపై డీజీసీఏ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో వెల్లడవుతాయని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు