గాంధీభవన్‌ గేట్‌కు తాళం!

26 Jun, 2022 01:26 IST|Sakshi
గాంధీభవన్‌ ఎదుట పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసేస్తున్న మహిళా కాంగ్రెస్‌ నేతలు

ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ బస్‌భవన్‌కు మహిళా కాంగ్రెస్‌ 

వారిని అడ్డుకునేందుకు గాంధీభవన్‌ గేటుకు తాళం వేసిన పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ బస్‌భవన్‌ వద్ద నిరసన వ్యక్తం చేసేందు కు బయల్దేరిన మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు ఏకంగా గాంధీభవన్‌కే తాళం వేశారు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనపై గాంధీభవన్‌లో ఉన్న మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు, ఇతర నాయకులు నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు తాళం తీశారు. దీంతో గాంధీభవన్‌ బయటకు వచ్చిన మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా పోలీసులకు మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో గాంధీభవన్‌ దగ్గరే మహిళా కాంగ్రెస్‌ నాయకులు నిరసన వ్యక్తంచేశారు. ఈ పరిణామంతో కొద్దిసేపు గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భారీగా ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రజల నడ్డి విరిచిందని ధ్వజమెత్తారు. బస్సు చార్జీలతో పాటు బస్‌పాస్‌ల ధరలను కూడా రూ.200 నుంచి 300 శాతం పెంచిందని మండిపడ్డారు. తాజాగా మరోసారి ఆర్టీసీ చార్జీలు పెంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు