రైతులు, కాంగ్రెస్‌ పార్టీ సమిష్టి విజయం: ఉత్తమ్‌

23 Oct, 2020 20:50 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలో రైతులు చేపట్టిన ధర్నాకు ఫలితం దక్కింది. అన్నదాత రోడ్డెక్కడంతో మొక్కజొన్న కొనుగోలుకు సర్కారు ముందుకు వచ్చింది. క్వింటాలుకు రూ. 1850 చొప్పున వరి కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్న కొంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు, కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాట ఫలితంగానే ప్రభుత్వం కొనుగోళ్ళకు అనుమతి ఇచ్చిందన్నారు. రైతుల పక్షాన నిలబడి తాము ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశామని, రైతులు, కాంగ్రెస్‌ పార్టీ సాధించిన సమిష్టివిజయంగా దీనిని అభివర్ణించారు.

ఇక జగిత్యాల, కామారెడ్డి ప్రాంతాలలో మొక్కజొన్న రైతులు పెద్దఎత్తున పోరాటం చేశారని, వారికి తమ పార్టీ మద్దతు ప్రకటించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ మేరకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులందరికీ సంపూర్ణ న్యాయం జరిగేంతవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కాగా వరి ధాన్యం కొనుగోలు కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి, మక్కలు కొనుగోలు చేస్తామని. క్వింటాలుకు రూ.1,850 మద్దతు ధర చెల్లిస్తామని, రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్‌ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.(చదవండి: సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయాలు )

మరిన్ని వార్తలు