Old City: పాతబస్తీపై ప్రత్యేక దృష్టి.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అని చాటేలా..

1 Nov, 2021 08:24 IST|Sakshi

వారసత్వ భవనాల పరిరక్షణ, పునరుద్ధరణ..

మార్కెట్ల ఆధునీకరణ, తదితర పనులు ‘కుడా’కు

బల్దియా నుంచి బదిలీ

పనులు త్వరితంగా జరిగేందుకు డిప్యుటేషన్‌పై ఇంజనీర్లు  

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలో ఎన్నెన్నో చారిత్రక కట్టడాలకు పునర్వైభవం కల్పించి హైదరాబాద్‌ నగర కీర్తిసిగలో వాటి ప్రాధాన్యత చెక్కు చెదరకుండా చేసేందుకు పలు కార్యక్రమాలు రూపొందించినప్పటికీ, పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాటిని త్వరితంగా పూర్తిచేసేందుకు పాతబస్తీ కేంద్రంగా పనిచేస్తున్న కులీకుతుబ్‌షా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కుడా)కి పలు పనులు అప్పగించారు. వాటిని త్వరితంగా పూర్తిచేయడం ద్వారా పాతబస్తీలోని కట్టడాలు.. ముఖ్యంగా వారసత్వ కట్టడాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు త్వరితంగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
చదవండి: ఏడేళ్లలో పాతబస్తీ అభివృద్ధికి రూ. 14,887 కోట్లు: కేటీఆర్‌ 

తద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలతోపాటు పాతబస్తీకి సైతం తగిన ప్రాధాన్యతనిచ్చినట్లవుతోందని అభిప్రాయపడుతోంది. అంతేకాదు.. చారిత్రక ప్రాధాన్యత కలిగిన వాటిని పునరుద్ధరించి, ఆధునీకరించడం ద్వారా పర్యాటకంగానూ ప్రజలను ఆకట్టుకోవచ్చుననేది ఆలోచన. ట్యాంక్‌బండ్‌ మీద విజయవంతమైన ఫన్‌డే–సన్‌డే కార్యక్రమాన్ని చార్మినార్‌ వద్ద కూడా చేపట్టడంతో సాధించిన విజయంతో పాతబస్తీలోని అన్ని ప్రముఖ ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు. 
చదవండి: ఫ్రెంచ్‌ తెలుగు భాష పరిశోధకుడితో కేటీఆర్‌ భేటీ

పాతబస్తీ అభివృద్ధి, పర్యాటక ఆకర్షణలుగా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, అవి పూర్తికాలేదు.ఆపనులు జీహెచ్‌ఎంసీ, తదితర సంస్థల పర్యవేక్షణ లో జరుగుతుండటంతో జీహెచ్‌ఎంసీలోనే పనుల ఒత్తిడి, తదితర కార్యక్రమాలతో పాతబస్తీ పనులు కుంటుపడుతున్నాయనే అభిప్రాయాలున్నాయి. అంతేకాకుండా పాతబస్తీ కేంద్రంగా ఉన్న పాతబస్తీలోని ప్రజల మౌలిక సదుపాయాలు, పాతబస్తీ అభివృద్ధి పట్టించుకోవాల్సిన కుడాకు చేతినిండా పనిలేకపోవడాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న మునిసిపల్‌ పరిపాలన,పట్టణాభివృద్ధిశాఖ కొన్ని ముఖ్యమైన పనులను జీహెచ్‌ఎంసీ నుంచి కుడాకు బదిలీ చేసింది.

అంతేకాదు వాటిని దగ్గరుండి పూర్తిచేసేందుకు అవసరమైన ఇంజినీర్లు, ఇతరత్రా అధికారులు, సిబ్బందిని డిప్యుటేషన్‌ మీద కుడాకు పంపించాల్సిందిగా ఆదేశించడంతో జీహెచ్‌ఎంసీ ఆమేరకు చర్యలు చేపట్టింది.  సదరు పనులు పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల్ని సైతం జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌నుంచి ఖర్చు చేస్తారు. ఇలా నిధులు, విధులు నిర్వహించే సిబ్బందిని కేటాయించడం ద్వారా పాతబస్తీలోని  వారసత్వ, కళాత్మక భవనాలను, మార్కెట్లను  వినూత్నంగా తీర్చిదిద్దనున్నారు. 

ఇవీ పనులు..   
పాతబస్తీ ప్రజలకు తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, హౌసింగ్‌ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన కుడాకు విద్య, వినోదం, మార్కెట్‌ సదుపాయాల కల్పనవంటి బాధ్యతలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ నామ్‌కేవాస్తేగా మారిన కుడాకు తగిన ప్రాధాన్యత కల్పించేందుకు, పాతబస్తీ అభివృద్ధి,సుందరీకరణపనులు త్వరితంగా చేసేందుకు దిగువ పనుల్ని అప్పగించారు. 

► పాతబస్తీలోని వారసత్వ భవనాల పరిరక్షణ, పునరుద్ధరణ.  
► పూర్తికావాల్సిన చార్మినార్‌ పాదచారుల పథకంలో మిగిలిన పనులు 
► లాడ్‌బజార్‌ పాదచారుల పథకం 
► సర్దార్‌మహల్‌ పునరుద్ధరణ, అభివృద్ధి, మ్యూజియం ఏర్పాటు 
► మీరాలంమండి, ముర్గీచౌక్‌ ఆధునీకరణ, అభివృద్ధి పనులు 
► మీరాలం చెరువు పరిరక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధి 

డిప్యుటేషన్‌పై అధికారులు 
పనులు పర్యవేక్షించేందుకు జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, ముగ్గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లకు బాధ్యతలప్పగించారు. వీరిలో కొందరిని జీహెచ్‌ఎంసీ నుంచి డిప్యుటేషన్‌ మీద కుడాకు బదిలీ చేశారు. కొందరికి జీహెచ్‌ఎంసీ బాధ్యతలతోపాటు అదనంగా కుడా పరిధిలోని పనుల బాధ్యతలు అప్పగించారు.    

మరిన్ని వార్తలు