గ్రహణంతో ఆలయాల మూసివేత

9 Nov, 2022 02:30 IST|Sakshi
యాదాద్రి ఆలయం మూసివేస్తున్న అర్చకులు, అధికారులు 

యాదగిరిగుట్ట/భద్రాచలం/బాసర (ముథోల్‌): చంద్ర గ్రహణం కారణంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు మంగళవారం మూతబడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంతోపాటు యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, నిర్మల్‌ జిల్లా బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మంగళవారం ఉదయం మూసివేశారు.

యాదాద్రిలో తెల్లవారుజామున సుప్రభాత సేవలు సహా ఇతర పూజల అనంతరం ఉదయం 6:15 గంటల నుంచి 7:30 గంటల వరకు భక్తులకు దర్శనాలు కల్పించారు. ఉదయం 8:15 గంటలకు ఆలయాన్ని మూసేసి తిరిగి చంద్రగహణం ముగిశాక రాత్రి 8 గంటలకు తెరిచారు. శుద్ధి, సంప్రోక్షణ, ఇతర పూజలు నిర్వహించారు. ఇక భద్రాచలంలో ఉదయం 7:30 గంటలకు ఆలయాన్ని మూసేసి రాత్రి 7:30 గంటలకు పవిత్ర గోదావరి జలాలతో సంప్రోక్షణ, శాంతిహోమం నిర్వహించారు.

బుధవారం ఉదయం నుంచి దర్శనాలు పునః ప్రారంభం అవుతాయని అధికారులు వెల్లడించారు. బాసరలోనూ ఉదయం పూజలు, నైవేద్య నివేదన అనంతరం అర్చకులు ద్వార బంధనం చేశారు. గ్రహణానంతరం రాత్రి 7:30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేశారు. ఆలయాల్లో మంగళవారం రద్దు చేసిన ఆర్జిత సేవలు, దర్శనాలు బుధవారం ఉదయం నుంచి కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు