పానం బోయినా జాగ ఇయ్య !

24 Apr, 2021 01:39 IST|Sakshi
ట్రాక్టర్‌కు అడ్డంగా పడుకొని పనులను అడ్డుకున్న అయోధ్యం 

ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో పనులను అడ్డుకున్న భూ బాధితుడు 

సాక్షి, గజ్వేల్‌: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో మల్లన్నసాగర్‌ నిర్వాసితుల గృహప్రవేశాలు చేస్తుండగా.. మరోవైపు ఈ కాలనీ నిర్మాణంతో భూమి కోల్పోతున్న బాధితులు ఆందోళన బాట పడుతున్నారు. తాజాగా శుక్రవారం ముట్రాజ్‌పల్లికి చెందిన మర్కంటి అయోధ్యం కాలనీలో భూమిని చదును చేసే పనులను అడ్డుకున్నాడు. ‘పానం బోయిన సరే ఈ భూమి ఇయ్య’గతంలోనే నేను మూడెకరాల భూమి ఇచ్చిన. ఈ పట్టా భూమి కూడా గుంజుకుంటే నేనట్ల బతకాలే?’అంటూ ట్రాక్టర్‌కు అడ్డంగా పడుకొని పనులు ఆపేశాడు.

రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, తనను గోస పెడుతున్నారని కన్నీరు పెట్టుకున్నాడు. ఈనెల 4న పోలీసు పహారా మధ్య కాలనీలో రోడ్లు, ఇతర మౌలిక వసతుల కోసమంటూ 332, 333 తదితర సర్వే నెంబర్లలో అధికారులు సుమారు 10 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో అయోధ్యంకు మూడు ఎకరాలు ఉంది. కాగా, మర్కంటి అయోధ్యం భూమిని చట్ట ప్రకారం స్వాధీనం చేసుకున్నామని, బాధితుడికి రావాల్సిన నష్ట పరిహారం ఇప్పటికే కోర్టులో డిపాజిట్‌ చేశామని గజ్వేల్‌ ఆర్‌డీఓ విజయేందర్‌రెడ్డి తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు