ఊరితో బంధం తెంచుకుంటూ.. కన్నీళ్లు పెడుతూ

8 Apr, 2021 12:02 IST|Sakshi

ఖాళీ అవుతున్న మల్లన్న సాగర్‌ నిర్వాసిత గ్రామాలు

గ్రామస్తుల భావోద్వేగం

బోరున విలపించిన మహిళలు 

తొగుట(దుబ్బాక): కొమురవెల్లి మల్లన్నసాగర్‌ నిర్వాసిత కటుంబాలు గజ్వేల్‌ మున్సిపల్‌ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి బుధవారం తరలివెళ్లారు. ముంపు గ్రామాలైన వేములఘాట్, పల్లేపహడ్‌ గ్రామాల ప్రజలు తమ కుటుంబాలతో కలిసి వెళ్లిపోయారు. ఆరు నెలల క్రితం లక్ష్మాపూర్‌ ప్రజలు గ్రామాన్ని ఖాళీచేసి వెళ్లిన విషయం తెలిసిందే. రిజర్వాయర్‌ కట్ట మధ్యలో ఉన్న లక్ష్మాపూర్, రాంపూర్‌ గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. కాగా సంగాపూర్‌లోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను లక్ష్మాపూర్‌ వాసులకు ప్రభుత్వం తాత్కాలికంగా కేటాయించింది. కాగా ప్రస్తుతం వేములఘాట్, పల్లేపహడ్‌ గ్రామాల ప్రజలు వారం రోజుల నుంచి వారికి కేటాయించిన ఇళ్లలోకి వెళ్తున్నారు.

ఈ క్రమంలో, వేములఘాట్‌ నుంచి 140 కుటుంబాలు, పల్లేపహడ్‌ నుంచి 103 కుటుంబాలు బుధవారం వెళ్లారు. నిర్వాసిత కుటుంబాలను తరలించేందుకు ప్రభుత్వం వాహనాలను ఏర్పాటు చేసింది. దీంతో పలు కుటుంబాలు నేడు గజ్వేల్‌కు తరలివెళ్లాయి. గ్రామాన్ని వదిలి వెళ్తున్న క్రమంలో మహిళలు, పురుషులు భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నాళ్లుగా గ్రామంతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని వెళ్తున్న క్రమంలో మహిళలు ఒకరిపై ఒకరు పడి బోరున విలపించారు. పుట్టి పెరిగిన ఊరి జ్ఞాపకాలను వదిలివెళ్లి పోతున్నామంటూ ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామంలో ఇన్నాళ్లుగా కష్టసుఖాల్లో అందరం అండగా ఉండేవారమని తలుచుకుంటూ విలపించారు. 

ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చేరుకున్న గ్రామస్తులు  
గజ్వేల్‌రూరల్‌: మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ముంపు బాధితులు వేములఘట్‌ గ్రామస్తులు గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధి ముట్రాజ్‌పల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలోకి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా బుధవారం వేములఘట్‌కు చెందిన బాధిత కుటుంబాలు డీసీఎం వాహనాల్లో తీసుకువచ్చిన సామగ్రిని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో తమకు కేటాయించిన ఇళ్లలోకి తరలించారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు